గ్రేటర్‌పై గులాబీ గురి! | TRS focus on GHMC Election | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై గులాబీ గురి!

Published Tue, Dec 29 2015 3:46 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

గ్రేటర్‌పై గులాబీ గురి! - Sakshi

గ్రేటర్‌పై గులాబీ గురి!

♦ రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్?
♦ నగరాన్ని గుప్పిట పెట్టుకునేందుకు టీఆర్‌ఎస్ కసరత్తు
♦ మెజారిటీ డివిజన్ల గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన
♦ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు
♦ నలుగురు మంత్రులు సహా కేటీఆర్‌కు గ్రేటర్ బాధ్యతలు
 
 సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో ‘గ్రేటర్’ ఎన్నికల సందడి  షురూ అయ్యింది. రెండు మూడు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందన్న వార్తలతో పార్టీలో హడావుడి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సోమవారం చేసిన ప్రకటనతో గ్రేటర్ ఎన్నికలపై ఓ స్పష్టత వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను తమ గుప్పిట పెట్టుకునేందుకు పార్టీ అధినాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అగ్ర నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటనలు చేశారు. గడిచిన ఆరేడు నెలలుగా అధికార పార్టీ గ్రేటర్ అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో పాటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. దీని కోసం నగరానికి చెందిన నలుగురు మంత్రులు సహా రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) పూర్తి స్థాయిలో గ్రేటర్ బాధ్యతలు అప్పజెప్పార ని చెబుతున్నారు.

 గ్రేటర్‌కు ప్రత్యేక మేనిఫెస్టో..
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ ఒంటరిగా పోటీ చేస్తామని టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. దీని కోసం ప్రత్యేక మేనిఫెస్టోనూ విడుదల చేయనుందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కనీసం 40 డివిజన్లను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని పార్టీ నేతలకు అగ్రనాయత్వం ఆదేశాలు ఇచ్చిందని సమాచారం. శివారు డివిజన్లలో పోటీ ఉండే అవకాశం ఉన్నందున నగరం లోపలే ఈ డివిజన్లను గుర్తించి ఏకగ్రీవమయ్యేలా వ్యూహాన్ని రచిస్తోందంటున్నారు. దీంతో ఆయా డివిజన్లలో ప్రజాబలం ఉన్న నాయకులను, ముఖ్యంగా వివిధ పార్టీలకు చెందిన మాజీ కార్పొరేటర్లను లాగేసుకునే పనిలో గులాబీ నేతలు బిజీగా ఉన్నారు.

నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునేలా వేగంగా అడుగులు వేస్తున్నారు. జనవరి చివరి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చిన గులాబీ నాయకత్వం డివిజన్లలో పలు కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నగరం మొత్తం ప్రచార హోర్డింగులతో నింపేసిన టీఆర్‌ఎస్, అదే స్థాయిలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. కాగా, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పరోక్షంగా జరిగే ఎన్నికల్లో కార్పొరేటర్ల ఓట్లతో పాటు ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయని, అందుకే గ్రేటర్‌లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దృష్టి పెట్టారని చెబుతున్నారు.
 
 మెజారిటీ డివిజన్లే టార్గెట్..
 ఆరేళ్ల కిందట జీహెచ్‌ఎంసీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒక్క డివిజన్‌లోనూ పోటీ చేయలేదు. కానీ, 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో ఈసారి కనీసం వంద డివిజన్లలో విజయం సాధించాలని టీఆర్‌ఎస్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ముందుచూపుతోనే టీడీపీకి చెందిన నలుగురు నగర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చారని విశ్లేషిస్తున్నారు. వీరితో పాటు కొద్దిరోజులుగా వివిధ డివిజన్లలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్లనూ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లోకి వలసలు బాగా పెరిగాయి. అలాగే నగర అభివృద్ధికి నిధులు కుమ్మరించడం, స్వచ్ఛ హైదరాబాద్‌లో అన్ని డివిజన్లను చుట్టిరావడం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నగరానికి గోదావరి తాగునీరు తదితర నిర్ణయాలన్నీ గ్రేటర్ ఓట్లు లక్ష్యంగా తీసుకున్నవేనని పేర్కొంటున్నారు. నగరంలో చేరికల వ్యవహారాలను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement