చీమ చిటుక్కుమనొద్దు: టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ బంద్ పిలుపు సందర్భంగా హైదరాబాద్‌లో చీమ చిటుక్కుమనకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఇన్‌చార్జీలతో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, కె.స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ సమావేశమయ్యారు. బంద్ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు సాకారమవుతున్న ఈ కీలక సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ సమయంలో హింస జరిగితే తెలంగాణ ఏర్పాటుపై ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందన్నారు. విధ్వంసాలు, హింసకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా బంద్‌ను, సంపూర్ణంగా నిర్వహించడానికి టీఆర్‌ఎస్ పెద్దన్న పాత్రను పోషించాలని ఇన్‌చార్జీలకు పార్టీ నేతలు సూచించారు.
ఏం జరిగినా సీఎందే బాధ్యత: నాయిని నర్సింహారెడ్డి
ఏపీఎన్జీఓ సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌దే బాధ్యతని టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ సభలకు అనుమతినివ్వకుండా, తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న సభకు సీఎం, డీజీపీ అనుమతినిచ్చినందుకు నిరసనగా తెలంగాణ బంద్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఎల్బీ స్టేడియం నిండిపోయిన తర్వాత బయట ఏమైనా సమస్యలు తలెత్తినా, రెచ్చగొట్టే చర్యలకు దిగి ఏమైనా జరిగితే సీఎం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయిని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు దాసోజు శ్రవణ్ అన్నారు. బంద్ వ్యూహంపై జీహెచ్‌ఎంసీ పార్టీ ఇన్‌చార్జీలతో వ్యూహంపై చర్చించామని శ్రవణ్ వివరించారు.
తెలంగాణకు హక్కులే లేవా...? : ఈటెల
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించే సభలపై ఆంక్షలు విధిస్తూ, తెలంగాణను వ్యతిరేకించే సభలకు హైదరాబాద్‌లోనే అనుమతిస్తూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆయున శుక్రవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు హక్కుల్లేవా?, తెలంగాణ ప్రజలవి జీవితాలే కావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ గడ్డమీద పెట్టుకునే సభకు తావుు వ్యతిరేకమేనని ప్రకటించారు. శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వనందకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు.