రేవంత్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మండిపాటు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు వంత పాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి తెలంగాణలో జీవించే హక్కు లేదని మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్ శనివారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల పరువు తీశాడని వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం ఏ మాత్రం తప్పుకాదని రేవంత్‌రెడ్డి వాదిస్తున్నాడని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానంటూ రేవంత్‌రెడ్డి స్వయంగా ఒప్పుకుంటున్నారని మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో రేవంత్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని అంజయ్య యాదవ్ ధ్వజమెత్తారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డి పట్ల టీఆర్‌ఎస్ కార్యకర్తలు సహనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
బాబు, రేవంత్ చీడ పురుగులు: గట్టు
ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలుగుజాతికి పట్టిన చీడ పురుగులని టీఆర్‌ఎస్ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణలో ఏపీ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి ఏజెంటులా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌తో అభివృద్ధిలో పోటీ పడలేక పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులకు బాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌కు నైతిక హక్కులేదు: ఎమ్మెల్సీ రాములు నాయక్
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం తగదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ హితవు పలికారు. శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఇఫ్తార్ విందు విషయంలో కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ముస్లిం వర్గానికి చెందిన నేతకు తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ శాఖ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
బాబు ట్యాపింగ్‌పై కేంద్రం స్పందించాలి: ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు
తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నదని గగ్గోలు పెడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడి నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రయత్నించడం సిగ్గు చేటని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్లను ట్యాప్‌చేసే సామగ్రి కొనుగోలుకోసం బేరసారాలకు లేఖలు రాయడం శోచనీయమన్నారు. చంద్రబాబు ట్యాపింగ్ సామగ్రి కొనుగోలు వ్యవహారంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.