హోంశాఖ అధికారులతో వివేక్, వినోద్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌లో చేరిన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ జి.వివేక్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బుధవారం ఉదయం హోంమంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్లారు. వారిద్దరూ హోంశాఖ ఉన్నతాధికారులు కొంతమందిని కలిసి చర్చలు జరిపారని తెలిసింది. విభజనపై జీవోఎంతో మంగళవారం జరిగిన భేటీలో టీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేకేతోపాటు వివేక్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఆ భేటీ చివర్లో టీఆర్‌ఎస్ నేతలతో హోంమంత్రి షిండే ప్రత్యేకంగా పది నిమిషాలు చర్చించారు. ఆ సమయంలోనే టీఆర్‌ఎస్ నేతలు కొన్ని అదనపు పత్రాలను, సమాచారాన్ని అందజేస్తామన్నారని, దానికి షిండే కూడా సమ్మతించి వెంటనే ఇవ్వాలని కోరారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే వివేక్, వినోద్ బుధవారం హోంశాఖ ఉన్నతాధికారుల్లో కొందరిని కలిసి మరికొన్ని పత్రాలను, అదనపు సమాచారాన్ని అధికారులకు అందజేశారని సమాచారం.