ఇపుడే ధర్మయుద్ధం మొదలైంది- పన్నీరు
చెన్నై: నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు. అరాచకశక్తులు ఇపుడు విజయం సాధించినా తమ పోరాటం కొనసాగుతుందని సెల్వం స్పష్టం చేశారు. ధర్మాన్నీ, న్యాయాన్నీ ఖూనీ చేశారన్నారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోరితే దాడిచేశారనీ, అన్యాయంగా కొట్టి, బలవంతంగా సభనుంచి లాగి పడేశారని విమర్శించారు. మాఫియా చర్యల్లో భాగంగా విశ్వాస పరీక్షను ముగించారని దుయ్యబట్టారు.
అసలైన యుద్ధం మొదలైందని పన్నీరువర్గం ప్రకటించింది. డీఎంకే, కాంగ్రెస్,ఇ తరప్రతిపక్ష సభ్యులు లేకుండా ఓటింగ్ నిర్వహించడం అప్రజాస్వామికమని ఆరోపించింది. అసలైన ధర్మ యుద్ధం ఇపుడే మొదలైంది. తమపోరాటం కొనసాగుతుందని పన్నీరు వర్గం స్పష్టం చేసింది.
కాగా మధ్యాహ్నం 3గంటలకు వాయిదా తరువాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో మూజువాణి ఓటింగ్‌ను కొనసాగించిన స్పీకర్ సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గినట్టు ప్రకటించారు. పళనికి మద్దతుగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు నమోదైనట్టు ప్రకటించారు.