హిల్లరీ ఆధిక్యానికి 'ట్రంప్' గండి | Trump cuts Clinton's lead in latest Reuters/Ipsos pollpoll | Sakshi
Sakshi News home page

హిల్లరీ ఆధిక్యానికి 'ట్రంప్' గండి

Published Sat, Oct 22 2016 2:27 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

హిల్లరీ ఆధిక్యానికి 'ట్రంప్' గండి - Sakshi

హిల్లరీ ఆధిక్యానికి 'ట్రంప్' గండి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు తప్పవన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రముఖ మార్కెటింగ్, సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి భారీగా గండికొట్టినట్లు తేలింది. ఎన్నికల్లో అక్రమాలు(రిగ్గింగ్) జరుగుతున్నాయంటూ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని అమెరికన్లు అర్థం చేసుకుంటున్నారని శుక్రవారం విడుదలైన రాయిటర్స్-ఇప్సో సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

అక్టోబర్ 14 నుంచి 20 మధ్య కాలంలో ట్రంప్ తన ఆధిక్యతను 40 శాతం నుంచి 44 శాతానికి పెంచుకున్నారని, అదే సమయంలో హిల్లరీ ఆధిపత్యానికి భారీగా తగ్గించగలిగారని సర్వేలో పేర్కొన్నారు. అక్టోబర్ 7-13 మధ్య హిల్లరీకి 44 శాతం, ట్రంప్ కు 37 శాతం మద్దతు దక్కింది. నిజానికి జాతీయ సరాసరిలో ఇప్పటికీ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ కు 41.9 శాతం మద్దతు లభిస్తే అతని కంటే 6.2 శాతం ఎక్కువ అంటే, 48.1 శాతం ఆధిక్యత హిల్లరీకి ఉంది. పోలింగ్ కు ఇంకా రెండు వారాలు గడువుండటంతో ఆ మాత్రం తేడాను కూడా ట్రంప్ అధిగమిస్తాడనే అభిప్రాయం వ్యక్తమైంది. ట్రంప్ చేస్తోన్న రిగ్గింగ్ ఆరోపణలను సొంత పార్టీ కార్యకర్తలు కూడా క్రమంగా సమర్థిస్తున్నారని, ఒకవేళ హిల్లరీ గెలిచినా అది రిగ్గింగ్ వల్లే జరుగుతుందని 70 శాతం మంది రిపబ్లికన్లు నమ్ముతున్నట్లు సర్వే పేర్కొంది.

ఇక ట్రంప్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు వాస్తవమేనని 62 శాతం మంది అమెరికన్లు నమ్ముతున్నట్లు సర్వే తెలిపింది. అయితే 'గతంలో ఆయన ఏం చేశారనేదానికంటే.. అధ్యక్షుడిగా ఏం చేస్తారనేదే ప్రధాన విషయం'అని ఓటర్లు వ్యాఖ్యానించినట్లు  రాయిటర్స్ తెలిపింది. 'గడిచిన వారంలో ట్రంప్ తన మద్దతును భారీగా పెంచుకున్నారు. పోలింగ్ తేదీకి మరో రెండు వారాలు సమయం ఉంది. ఈ లోపు జాతీయ సరాసరిలోనూ ఆయన హిల్లరీని అధిగమించడం ఖాయం'అని రిపబ్లికన్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ సర్వే అమెరికన్ల ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉన్నదని ఆ పార్టీ అభిప్రాయపడింది. రిపబ్లికన్ పార్టీకే చెందిన మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్.. బానిసత్వం రద్దుచేసిన సందర్భంగా ఏ వేదికపై నుంచి మాట్లాడారో.. పెన్సిల్వేనియాలోని అదే గెట్టీస్ బర్గ్ లో డోనాల్ట్ ట్రంప్ కీలక ప్రసంగం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement