'డెత్ బై చైనా': డ్రాగన్‌కు మళ్లీ ట్రంప్ షాక్!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచి చైనా వ్యతిరేక విధానాలను బాహాటంగా అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన.. చైనా అంటేనే విరుచుకుపడే ఆర్థికవేత్త పీటర్ నెవారోను తన సలహాదారుగా ఎన్నుకున్నారు. కీలక విధాన నిర్ణయాలకు ఉద్దేశించిన వైట్‌హౌస్ జాతీయ వాణిజ్య మండలి అధిపతిగా నెవారోను ఎంపిక చేశారు. విద్యావేత్త అయిన నెవారో గతంలో వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్‌గా కూడా పనిచేశారు. చైనాతో అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై ఎన్నో పుస్తకాలు రాశారు. ఒక సినిమా కూడా తీశారు. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక ఆధిపత్య శక్తి, సైనిక శక్తిగా చైనా ఎదుగాలనుకుంటున్నదని, దీనితో అమెరికాకు ముప్పు పొంచి ఉన్నదని ఆయన విశ్లేషించారు.
ఆర్థిక విధానాల్లో కాబోయే అధ్యక్షుడిగా సలహాదారుగా ఎన్నికైన నెవారో మంచి ఆర్థిక దర్శనికుడని, ఆయన దేశ వ్యాపార, వాణిజ్యాలు క్షీణించకుండా, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేలా, విదేశాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఆర్థిక విధానాల రూపకల్పనలో తోడ్పాటు అందించనున్నారని ట్రంప్ టీమ్ పేర్కొంది.
కాలిఫోర్నియా, ఇర్విన్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన 67 ఏళ్ల నెవారో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంలోనూ ట్రంప్‌కు కీలక సలహాదారుగా వ్యవహరించారు. ఆయన రాసిన పుస్తకాల్లో 'డెత్ బై చైనా: హౌ అమెరికా లాస్ట్ ఇట్స్ మాన్యుఫాక్చరింగ్ బేస్' అనే పుస్తకం డాక్యుమెంటరీ ఫిలిమ్‌గా రూపొందింది. చైనాతో ఆర్థిక యుద్ధంలో అమెరికా ఓడిపోతుందని, దీంతో చైనా దిగుమతుల వల్ల అమెరికాలో పర్యావరణ సమస్యలే కాక, మేధోసంపన్న విషయాల్లోనూ విఘాతం ఏర్పడుతుందని ఆయన విశ్లేషించారు. తదుపరి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ తన పాలనలో చైనాపై ఎలాంటి వైఖరి అనుసరించనున్నారనో చెప్పకనే చెబుతున్నారు. చైనాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఆయన తన విధానాలను రూపొందిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల తైవాన్ అధినేతతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడటం అమెరికా-చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే.