ట్రంప్ కు కోర్టులో ఎదురుదెబ్బ
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు తొలిసారిగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది.
డొనాల్డ్ నిర్ణయంతో న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రయంలో 12 మంది శరణార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరిని మాత్రమే అమెరికా అధికారులు విడిచిపెట్టారు. మిగతావారి తరపున కోరుతూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్ యూ) కోర్టును ఆశ్రయించింది. నిర్బంధించిన వారిని 14 నుంచి 24 గంటల్లో విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తాము విధించిన స్టే దేశమంతా వర్తిస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఉన్న శరణార్థులను వెనక్కు పంపొద్దని.. అంటే దీనర్థం వారిని అమెరికాలోకి అనుమతించమని కాదని... వీరిని గ్రే ఏరియా(శరణార్థి శిబిరం)లో ఉంచాలని సూచించింది.
శరణార్థులను అనుమతించకూడదని డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఉత్తర్వు జారీచేయడంతో అమెరికా విమానాశ్రయాల్లో ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను, శరణార్థులను అడ్డుకున్నారు. అన్నిపత్రాలు ఉన్నప్పటికీ వారిని అనుమతించలేదు. శనివారం ఒక్కరోజే 100 నుంచి 200 మందిని అమెరికా అధికారులు అడ్డుకున్నారని ఏసీఎల్ యూ సంస్థ అంచనా వేసింది.