అల్లుడికి పెద్ద పదవి ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ సొంత అల్లుడు జారెద్ కుష్నర్‌కు కీలక పదవి కట్టబెట్టారు. తనకు సీనియర్ సలహారుదారుగా అల్లుడిని నియమించారు. వాణిజ్యం, మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్‌కు అప్పగించారు. అమెరికా అధ్యక్షుడి బంధువులు కీలక పదవులను చేపట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
చట్టబద్దమైన ఆమోదం లభించిన వెంటనే 35 ఏళ్ల కుష్నర్ సలహాదారు పదవి చేపడతారు. ప్రభుత్వ పదవుల్లో ఆశ్రిత పక్షపాతాన్ని నిరోధిస్తూ 1967లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించలేదని నిర్ధారణ అయిన తర్వాతే కుష్నర్ పదవి చేపట్టడానికి వీలవుతుంది. సలహాదారుకు జీతం చెల్లించరు కాబట్టి సెనేట్ ఆమోదం అవసరం లేదు.
‘కుష్నర్ తనకు లభించిన అద్భుత ఆస్తి.. ఎన్నికల ప్రచారం, అధికార బదిలీలో నమ్మకమైన సలహారుదారుగి నిలిచాడ’ని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకాను పెళ్లాడిన కుష్నర్.. న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యవరించారు. తన భర్తకు కీలక పదవి దక్కడంతో తాను ఇంటికే పరిమితం కావాలని ఇవాంకా భావిస్తున్నారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు షిప్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.