మరో వివాదంలో ట్రంప్ భార్య
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ టాబ్లాయిడ్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధలను ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.
1995లో ఆమె న్యూయార్క్లో మోడల్గా కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో ఓ ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో మెలానియా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మెలానియా, ఏ టైప్ వీసా ఉపయోగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని, వీసా నిబంధనలను మార్చాలని ప్రధానంగా ప్రచారం చేస్తున్న ట్రంప్ శిబిరానికిది ఇబ్బందికరంగా మారింది. మెలానియాపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ మేనేజర్ ఖండించినా, స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. మెలానియా స్వదేశం స్లొవేనియా. ట్రంప్కు ఆమె మూడో భార్య. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు.