Republican presidential nominee
-
మాజీ అధ్యక్షుడు మమ్మల్ని రేప్ చేశాడు!
సెయింట్ లూయిస్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తమపై లైంగిక దాడి జరిపాడంటూ నలుగురు మహిళలు ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్ కు ముందు ఈ నలుగురు మహిళలతో కలిసి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్ తమపై అత్యాచారం జరిపాడని ముగ్గురు మహిళలు ఆరోపించగా.. తాను బాలికగా ఉన్నప్పుడు అతను తనపై లైంగిక దాడి జరిపాడని మరో మహిళ ఆరోపించింది. ప్రస్తుతం డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్. మహిళలపై తాను లైంగికపరమైన దుర్భాషలు చేసిన వీడియో వెలుగులోకి వచ్చి దుమారం రేపుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఆమె భర్తపై ఆరోపణలు చేసిన మహిళలతో డొనాల్డ్ ట్రంప్ ఈ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నలుగురు మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడటం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం అధ్యక్ష డిబేట్ లో ట్రంప్-హిల్లరీ మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. -
మరో వివాదంలో ట్రంప్ భార్య
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్‌కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ టాబ్లాయిడ్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధలను ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. 1995లో ఆమె న్యూయార్క్‌లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో ఓ ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో మెలానియా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మెలానియా, ఏ టైప్ వీసా ఉపయోగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని, వీసా నిబంధనలను మార్చాలని ప్రధానంగా ప్రచారం చేస్తున్న ట్రంప్ శిబిరానికిది ఇబ్బందికరంగా మారింది. మెలానియాపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ మేనేజర్ ఖండించినా, స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. మెలానియా స్వదేశం స్లొవేనియా. ట్రంప్‌కు ఆమె మూడో భార్య. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. -
మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్!
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చాడు. లైవ్ ప్రసారంలో తనదైన శైలిలో ఆమెను కసురుకుంటూ కాస్తా ‘నోరుమూస్తావా’ అని ట్రంప్ పేర్కొన్నాడు. ఫ్లోరిడాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన జరిగింది. ‘ఈ దేశానికి చెందిన ఎవరిదైనా కంప్యూటర్ను హ్యాక్ చేయమని రష్యా లేదా చైనాను అడుగడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదా’ అంటూ ఎన్బీసీ రిపోర్టర్ కేటీ టర్ ట్రంప్‌ను అడిగింది. హిల్లరీ ఈమెయిల్స్‌ను హ్యాక్ చేయమంటూ ట్రంప్ పేర్కొన్న వ్యాఖ్యలను ఉటంకించేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరుగడంతో అసహనం చెందిన ట్రంప్ ‘కాస్తా నోరుమూస్తావా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో నోచ్చుకున్నట్టు కనిపించిన కేటీ మళ్లీ ప్రశ్నలు అడుగలేదు. క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె పంపిన ఈమెయిల్ మిస్సవ్వడంతో.. ఆ ఈమెయిల్స్‌ను కనిపెట్టడంలో రష్యా తమకు సహాయం చేయాలని ట్రంప్ పేర్కొనడం పెద్ద దుమారం రేపింది. -
అమెరికా మీడియాపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పదును పెట్టాడు. అమెరికా మీడియా అగౌరవంగా వ్యవహరిస్తోందని తిట్టిపోశాడు. టీవీ జర్నలిస్టులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డాడు. 'దినపత్రికలు రోజూ అపకీర్తికరమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు కథనాలని ప్రజలకు తెలుసు. మీడియాపై దాడి చేస్తూనే ఉంటాన'ని 69 ఏళ్ల ట్రంప్ పునరుద్ఘాటించారు. న్యూయార్క్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మీడియా కథనాలు ప్రచారం చేస్తోందని వాపోయారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వృద్ధుల సంక్షేమం కోసం జనవరిలో ఐయోవాలో ఒకరాత్రిలో ఆరు మిలియన్ డాలర్లు సేకరించానని ట్రంప్ చెప్పుకోవడంతో దీన్ని ప్రశ్నిస్తూ మీడియా విమర్శనాత్మక కథనాలు ప్రచారం చేసింది. మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా పట్టించుకోనని అన్నారు. కాగా, మీడియాపై ట్రంప్ వ్యాఖ్యలను వైట్ హౌస్ కరస్పాండెంట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ) ఖండించింది.