అమెరికా మీడియాపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పదును పెట్టాడు. అమెరికా మీడియా అగౌరవంగా వ్యవహరిస్తోందని తిట్టిపోశాడు. టీవీ జర్నలిస్టులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డాడు. 'దినపత్రికలు రోజూ అపకీర్తికరమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు కథనాలని ప్రజలకు తెలుసు. మీడియాపై దాడి చేస్తూనే ఉంటాన'ని 69 ఏళ్ల ట్రంప్ పునరుద్ఘాటించారు.
న్యూయార్క్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మీడియా కథనాలు ప్రచారం చేస్తోందని వాపోయారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వృద్ధుల సంక్షేమం కోసం జనవరిలో ఐయోవాలో ఒకరాత్రిలో ఆరు మిలియన్ డాలర్లు సేకరించానని ట్రంప్ చెప్పుకోవడంతో దీన్ని ప్రశ్నిస్తూ మీడియా విమర్శనాత్మక కథనాలు ప్రచారం చేసింది. మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా పట్టించుకోనని అన్నారు. కాగా, మీడియాపై ట్రంప్ వ్యాఖ్యలను వైట్ హౌస్ కరస్పాండెంట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ) ఖండించింది.