ఈ ఒక్కసారి.. నన్ను నమ్మండి: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హామీలు, పరస్పర విమర్శలతో హోరెత్తించారు. ఎన్నికలకు ముందు రోజు హోరాహోరీగా ప్రచారం చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచారం నిర్వహించారు.
సోమవారం హిల్లరీ, ఒబామా కలసి పలు సభల్లో పాల్గొన్నారు. మిచిగాన్లో ఎన్నికల ర్యాలీలో ఒబామా మాట్లాడుతూ.. ఈ ఒక్కసారి తనను నమ్మి హిల్లరీకి ఓటు వేయాలని విన్నవించారు. చరిత్ర సృష్టించే అవకాశం అరుదుగా వస్తుందని, దీన్ని వదులుకోవద్దని ప్రపంచమంతా మనల్ని చూస్తోందని ఒబామా అన్నారు. అందరం ఓటు హక్కు వినియోగించుకుంటే హిల్లరీ గెలుస్తారని, ఓటు వేయకుండా ఇంటికే పరిమితమైనా, ఓటు వేసేందుకు నిరసన తెలిపినా హిల్లరీ ప్రత్యర్థి గెలుస్తారని చెప్పారు. హిల్లరీ ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై ఒబామా విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఏ మాత్రం అర్హుడు కాడని అన్నారు. ప్రచారం చివరి రోజు హిల్లరీకి మద్దతుగా ఆమె కుమార్తె చెల్సియా, ఒబామాతో పాటు ఆయన భార్య మిచెల్లి ఒబామా ప్రచారం చేశారు.
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కూడా హిల్లరీపై విమర్శలు కొనసాగించారు. ఈ మెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ తప్పుచేసినట్టు ఎఫ్బీఐకి తెలుసునని ఆరోపించారు. హిల్లరీని రక్షించే ప్రయత్నం చేశారని చెప్పారు. మీడియాను కూడా ఆయన విమర్శించారు.