
అది ఐఎస్ఐఎస్ పనే: ప్రధాని
తమ విమానాశ్రయంపై దాడిచేసి, పలువురి ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాద దాడి వెనుక ఉన్నది ఐఎస్ఐఎస్సేనని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నట్లు టర్కీ ప్రధానమంత్రి బినాలీ యిల్డిరిమ్ అన్నారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ప్రకటించారు. దుర్ఘటన జరిగిన ఇస్తాంబుల్ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఉన్న సాక్ష్యాలన్నీ డయేష్ అనే సంస్థకు సంబంధించి కనిపిస్తున్నాయని.. ఇది ఐఎస్ఐఎస్కు మరో పేరని ఆయన తెలిపారు.
చాలామంది గాయపడ్డారన్న ప్రధాని.. ఆ సంఖ్యను మాత్రం చెప్పలేదు. ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు ఆటోమేటిక్ రైఫిళ్లతో ప్రయాణికులపై కాల్పులు జరిపి, తర్వాత తమను తాము పేల్చేసుకున్నారని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు విమనాశ్రయానికి ఓ టాక్సీలో వచ్చినట్లు ప్రధాని వివరించారు. యూరప్లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇస్తాంబుల్లో భద్రతాపరమైన లోపం మాత్రం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) ఎయిర్ ట్రాఫిక్ను పునరుద్ధరించామన్నారు.