ట్విట్టర్ యూజర్లకు ఆ ఫీచర్ వచ్చేస్తోంది!
సామాజిక మాధ్యమిక సాధనాల్లో ఒకటైన ట్విట్టర్ తన వినియోగదారులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునేలా అవకాశం కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. యూజర్లకు అనుకూలంగా ట్విట్టర్ను మార్చాలని భావించిన కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రజల అభిప్రాయాల కోసం గురువారం ఓ ట్వీట్ చేశారు. 2017 ట్విట్టర్లో మెరుగుపరచదలిచిన లేదా సృష్టించదగిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటని ట్విట్టర్లో కోరారు. దీనికి సమాధానంగా చాలామంది యూజర్లు ఎడిటింగ్ ట్వీట్స్ ఫీచర్ను అందుబాటులోకి తేవాలని కోరారు. అదేవిధంగా ట్వీట్లను ఆర్గనైజ్ చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు.
ప్రజాభిప్రాయానికి అనుకూలంగా త్వరలోనే ట్వీట్లను ఎడిట్ చేసుకునే ఫీచర్ను తీసుకొస్తామని డోర్సే పేర్కొన్నారు. ఒకే ట్వీట్పైనే వివిధ వెర్షన్లలో యూజర్లు సమీక్షించాల్సినవసరం కూడా ఉందన్నారు. అదేవిధంగా ట్విట్టర్లో వచ్చే అంశాలపై కూడా పారదర్శకత తీసుకురావడానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలని యూజర్లు కోరారు. సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కువగా పాపులర్ అయిన ట్విట్టర్ ఎన్నికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన యూజర్ల వృద్ధి రేటును మాత్రం పెంచుకోలేకపోతోంది. ప్రజల ట్వీట్ల మేరకు ట్విట్టర్ను రీడిజైన్ చేయాలని భావిస్తోంది. 140 క్యారెక్టర్ లిమిట్ నుంచి వీడియోలను, ఫోటోలను ట్విట్టర్ వైదొలగించింది. సైట్పై లైవ్ 360 డిగ్రీ వీడియోలను నిన్ననే ట్విట్టర్ ఆవిష్కరించింది.