చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. పొల్లాచ్చిలోని లూథరన్ చర్చి ఆవరణలో ఉన్న హాస్టల్ లోకి ప్రవేశించిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఇద్దరు బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడగట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ యువకులు వారు ఉంటున్న హాస్టల్లోకి ప్రవేశించి తలుపు తట్టారు. దీంతో ఓ విద్యార్థిని తలుపు తీయగా, దాహం వేస్తోందంటూ ఓ యువకుడు చెప్పడంతో ఆ బాలిక వారికి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలోనే అక్కడకు ప్రవేశించిన మరో యువకుడు నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థినులను తమ భుజాన వేసుకుని ఓ పాడుబడ్డ భవనంలో తీసుకువెళ్లారు. అనంతరం వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
హాస్టల్ వద్ద జరిపిన విచారణలో చర్చ్‌కు సంబంధించిన ఆ హాస్టల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, అక్కడ విద్యార్థినుల భద్రతకు కనీసం వార్డెన్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఘటనను ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. సాయంత్రం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఘటన వివరాలను సేకరించారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొంటూ, మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియూ ప్రకటించారు.