ఆటలాడుతూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత | two students dead at school ground | Sakshi
Sakshi News home page

ఆటలాడుతూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత

Published Sun, Jan 24 2016 6:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

two students dead at school ground

* వరంగల్ జిల్లాలో ఒకరు..
* ఖమ్మం జిల్లాలో మరొకరు

జూలూరుపాడు/కొత్తగూడ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ఆటలాడుతూ శనివారం ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెంకు చెందిన భూక్యా భద్రాచలం(13), వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన విజయ్‌కుమార్(14)లు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెనికి చెందిన భూక్యా హరి, కళావతిల ఏకైక కుమారుడు భూక్యా భద్రాచలం జూలూరుపాడు మండలం సాధన పబ్లిక్ స్కూల్ ఏడో తరగతి చదువుతున్నాడు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం  సహచర విద్యార్థులతో ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే భద్రాచలం చనిపోయాడు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, అందుకు వారు బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన గుమ్మడి వీరస్వామి, వెంకటమ్మ దంపతుల రెండో కుమారుడు విజయ్‌కుమార్(14) ఇదే మండలం బత్తులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడుతూ ఆయాసానికి గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు   తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే విజయ్‌కుమార్ చనిపోయాడు.
 
గుండెపోటుతో విద్యార్థి మృతి
ఇబ్రహీంపట్నం: పాఠశాలలో ప్రార్థన చేస్తుండగా ఓ విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందిన విషాద సంఘటన ఇది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడకు చెందిన యెంపల్ల తిరుమల్‌రెడ్డి, మంజుల దంపతుల పెద్దకొడుకు త్రిష్ రెడ్డి(10) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన త్రిష్ రెడ్డి స్కూల్‌లో ప్రార్థన చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో త్రిష్ రెడ్డి  మృతిచెందాడు. ఈ ఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కాగా, మూడేళ్ల క్రితం బాలుడి తండ్రి తిరుమల్‌రెడ్డి కూడా గుండెపోటుతోనే మృతి చెందాడు. ఇపుడు త్రిష్‌రెడ్డి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెల కొంది. ఉన్న  కొడుకూ గుండెపోటుతో మృతి చెందడంతో తల్లి రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement