ఉబెర్ వ్యాపారంలోకి గూగుల్!
డ్రైవరు లేని కార్లతో ప్రయోగం
ఉబెర్‌లోకి కూడా ఆ తరహా కార్లు
శాన్‌ఫ్రాన్సిస్కో: డ్రైవరు లేకుండా నడిచే కార్లను రూపొందిస్తున్న ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్... ఆ ప్రాజెక్టులో భాగంగా ఉబెర్ వంటి రైడింగ్ సేవల వ్యాపారంలోకి కూడా ప్రవేశించాలని చూస్తోంది. ఇప్పటికే ఉబెర్ తరహా ‘యాప్’ను గూగుల్ అభివృద్ధి చేసినట్లు సమాచారం. దీన్ని గూగుల్ ఉద్యోగులు వాడుతున్నట్లు ఉబెర్ ఉన్నతాధికారులకు తెలుసునని కూడా బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ తెలియజేసింది. నిజానికి ఉబెర్‌లో గూగుల్ అతిపెద్ద ఇన్వెస్టరు. గూగుల్ ప్రధాన లీగల్ అధికారి డేవిడ్ డ్రమ్మండ్ ఉబెర్ బోర్డులో ఉన్నారు కూడా. తాము ఉబెర్ తరహా యాప్‌ను రూపొందించే అవకాశం ఉందని ఇటీవల డ్రమ్మండ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో డ్రమ్మండ్‌ను రాజీనామా చేయమని ఉబెర్ కోరనున్నట్లు సమాచారు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందిస్తూ... ట్యాక్సీ రైడింగ్ అనేది చాలా పెద్ద మార్కెట్ అని, దీన్లో తాము సొంత పెట్టుబడులతోగానీ, లేదంటే ఉబెర్ వంటి భాగస్వాములతో గానీ కొనసాగుతామని స్పష్టంచేసింది.
2013లో ఉబెర్‌లో గూగుల్ పెట్టుబడుల కంపెనీ గూగుల్ వెంచర్స్ 258 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఇన్వెస్ట్‌మెంట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల పేర్కొంది కూడా. కాగా దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉబెర్... ఖర్చులు తగ్గించుకోవటానికి డ్రైవర్ లేని కార్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇటీవలే చెప్పింది. ‘‘ఉబెర్‌లో ప్రయాణానికి అయ్యే ఖర్చులో అత్యధికం డ్రైవర్లదే. అదే డ్రైవర్ లేకపోతే చాలా చౌకగా ప్రయాణించొచ్చు. సొంత కారుకన్నా ఇదే బెటరనిపిస్తుంది’’ అనేది ఉబెర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ అభిప్రాయం. అవసరమైనపుడు సెల్ఫ్‌డ్రైవింగ్ కారు లభిస్తే తమ సొంత కార్లను వదిలిపెట్టడానికి అమెరికాలో 25 శాతం మంది వాహన యజమానులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల గార్ట్‌నర్ సంస్థ జరిపిన సర్వేలో సైతం వెల్లడి కావటం గమనార్హం.