చైనా నుంచి తప్పుకున్నా నష్టాలే...
చైనా నుంచి తప్పుకున్నా నష్టాలే...
Published Tue, Dec 20 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
దేశ, విదేశాల్లో పాపులర్ అయిన క్యాబ్ సేవల నిర్వహణ సంస్థ ఉబర్ సంస్థ మరింత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది. చైనా నుంచి వ్యాపారాల్లో వైదొలిగినప్పటికీ, కంపెనీ ఆర్థిక నష్టాలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. ఈ ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీ 2.2 బిలియన్ డాలర్లు(రూ.14,926కోట్లకు పైగా) నష్టాలను మూటకట్టుకున్నట్టు కంపెనీకి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. చైనా ఆపరేషన్లు కలపన్నప్పటికీ ఉబర్ టెక్నాలజీస్ మూడో క్వార్టర్లో 800 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్టు తెలిసింది. కానీ ఇదేసమయంలో రెవెన్యూలు పెంపు కొనసాగిందని వెల్లడైంది. 2016 మొదటి తొమ్మిది నెలల కాలంలో నికర ఆదాయాలు 3.76 బిలియన్ డాలర్ల(రూ.25,517 కోట్లకు పైగా)ను కంపెనీ ఆర్జించగలిగింది.
అమెరికాలో ప్రత్యర్థులందరినీ పడేసి విజయ ఢంకా మోగించి... ఆసియాలోకి ప్రవేశించిన ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌కు చైనాలో గట్టిదెబ్బే తగిలింది. బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించినా చైనా మార్కెట్లో పట్టు సంపాదించలేకపోవటంతో ఈ రైడ్ దిగ్గజం ఆగస్టు 1న అక్కడ క్యాబ్ మార్కెట్లో అగ్రగామి సంస్థ దీదీ చుక్సింగ్లో ఉబర్ కంపెనీని విలీనం చేసేసింది. ఒప్పందంలో భాగంగా దీదీ 1 బిలియన్ డాలర్లను ఉబర్లో పెట్టుబడులు పెట్టింది. దీంతోనైనా కొంత నష్టాలను తగ్గించుకోవాలని కంపెనీ భావించింది. కానీ కంపెనీ నష్టాలు తగ్గకపోగా, మరింత పెరిగినట్టు తెలుస్తోంది.
Advertisement