ఉద్దానం బద్దలవుతోంది | Uddanam kidney problem becoming bigger | Sakshi
Sakshi News home page

ఉద్దానం బద్దలవుతోంది

Published Mon, Apr 10 2017 10:06 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

చికిత్స పొందుతున్న బాధితుడు(ఫైల్‌)

చికిత్స పొందుతున్న బాధితుడు(ఫైల్‌)

- తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఉన్నవారు ఎక్కువైనట్టు వెల్లడి
- ముప్పై ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది బాధితులు
- వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్న ఐసీఎంఆర్‌
- ఇప్పటివరకూ 77 వేల మందికి వైద్య పరీక్షలు.. 20 శాతం మందిలో అధిక తీవ్రత


సాక్షి, అమరావతి:
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వైద్య పరీక్షల్లో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిసంఖ్య తీవ్రంగా పెరుగుతూండటం కలవరపెడుతోంది. ఉద్దానంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల నుంచి సాక్షి సమాచారం సేకరించగా.. బాధితుల్లో ఎక్కువ మంది ముప్ఫై ఏళ్ల వారుండటం కలవర పెట్టే అంశం.

2017 మార్చి 31 వరకు సుమారు 110 పల్లెల్లో 77 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 20 శాతం వరకూ బాధితులు తీవ్ర మూత్రపిండాల వ్యాధికి గురైనట్టు తేలింది. అంటే 15 వేల మంది పైచిలుకు బాధితుల్లో మోతాదుకు మించి సీరం క్రియాటినైన్‌ ఉన్నట్టు తేలింది. మూత్రపిండాల వ్యాధికి కారణమైన సీరం క్రియాటినైన్‌ 1.2 కంటే తక్కువగా ఉంటేనే కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్టు. కానీ వైద్య పరీక్షల్లో 1.2 నుంచి 4 వరకు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సీరం క్రియాటినైన్‌ 5గా నమోదైన వారు కూడా 500 మంది ఉన్నట్టు తేలింది. బాధితులకు ఇప్పటికే 80 శాతం పైన దెబ్బతిన్నట్టు తేలింది. ఇలాంటి వారిని తక్షణమే డయాలసిస్‌ కేంద్రాలకు తరలించాలని వైద్యులు సూచించారు. సీరం క్రియాటినైన్‌ 3 కంటే తక్కువగా ఉన్న వారిని సోంపేట, పలాస, హరిపురం, కవిటి తదితర సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 15 నాటికి వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తవుతుందని, ఇంకా ఎంతమంది బాధితులున్నారో అర్థం కావడం లేదని వైద్యులు తెలిపారు.

ఉన్నతస్థాయి కమిటీలు ఏం చెప్పాయి?
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అలాగే కేంద్రం ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) బృందాన్ని వేసింది. ఈ రెండు కమిటీలు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి..
ఈ ప్రాంతంలో పరిస్థితులపై సుదీర్ఘమైన ప్రయోగాలు (రీసెర్చ్‌) జరగాల్సిన అవసరం ఉంది
సీకేడీ (క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్‌) వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలి
ఇక్కడ కిడ్నీ జబ్బులను నియంత్రించేందుకు వైద్యులు తదితర సిబ్బందిని బాగా పెంచాలి
కిడ్నీ వ్యాధులకు కారణమైన పర్యావరణ కారకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

ఈ చర్యలు తీసుకుంటున్నాం: ప్రభుత్వం
ఏప్రిల్‌ 15 వరకూ కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షలు
కిడ్నీ వ్యాధుల పరీక్షలకు సోంపేట, పలాస, కవిటి, హరిపురం మండలాల్లో ల్యాబ్‌ పరికరాలు ఏర్పాటు
పలాస సామాజిక ఆరోగ్య కేంద్రంలో డ యాలసిస్‌ కేంద్రం ఏర్పాటు.. సోంపేటలో కూడా త్వరలో ఏర్పాటుకు చర్యలు
రెండు వారాలకు ఒకసారి టెక్కలి ఏరియా ఆస్పత్రిలో మూత్రపిండాల వ్యాధి నిపుణుల (నెఫ్రాలజిస్ట్‌)ను అందుబాటులో ఉంచడం
కింగ్‌జార్జి ఆస్పత్రి నిపుణుల ఆధ్వర్యంలో ఉద్దానం ప్రాంతంలో పనిచేస్తున్న వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి కిడ్నీ వ్యాధుల గురింపుపై శిక్షణ
కిడ్నీ వ్యాధుల తీవ్రత ఉన్న వారి వివరాలను ఆధార్‌తో అనుసంధానించి వైద్యసేవలు
కిడ్నీ ప్రభావిత పల్లెలకు రక్షిత మంచినీటి వసతి కల్పించడం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement