
మోదీకి ఉద్ధవ్ ఫోన్
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు పార్టీలు మెట్టు దిగడంతో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై కమలనాథులు చర్చించినట్టు తెలుస్తోంది.
మరోవైపు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మెత్తబడ్డారు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని సూచాయగా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలతో ఫోన్ లో మాట్లాడారు. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉండగానే మోదీ, అమిత్ షాలకు ఉద్ధవ్ ఫోన్ చేయడం గమనార్హం.
అయితే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు జరగలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ముందుగా హర్యానాపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తోంది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు దూతను పంపాలని యోచిస్తోంది.