భూతలం నుంచి ఆకాశంలోని లక్ష్యాన్ని ఛేదించే బీయూకే క్షిపణి
రష్యా క్షిపణులతో ఉక్రెయిన్ గగనతలంలో కరువైన భద్రత
పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చేసిన తిరుగుబాటుదారులు
ఆధిపత్య పోరుతో విషమించిన పరిస్థితి
రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా..
అదే రోజున మలేసియా విమాన దుర్ఘటన
ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారులకు మద్దతుగా రష్యా అందజేస్తున్న క్షిపణులే ప్రమాదకరంగా మారాయా? వాటివల్లే ఉక్రెయిన్ గగనతలం ఏమాత్రం భద్రత లేనిదిగా తయారైందా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడానికి కారణం.. ఆ దేశంలో కొద్ది రోజులుగా చోటు చేసుకున్న ఘటనలే! ఉక్రెయిన్‌లో అంతర్యుద్ధం కారణంగా.. ప్రభుత్వ సైన్యానికి, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు మధ్య తీవ్ర పోరు జరుగుతోంది. ఈ క్రమంలో తిరుగుబాటుదారులు రష్యా విమాన విధ్వంసక క్షిపణులతో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశారు. గత నాలుగు రోజుల్లోనే ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు. సోమవారం తిరుగుబాటు దారులు ఉక్రెయిన్ యుద్ధ విమానాన్ని కూల్చివేయగా, బుధవారం తమ ఎస్‌యూ-25 విమానాన్ని రష్యా కూల్చివేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. అంతేగాకుండా బుధవారం రెండు, మంగళవారం ఒక ఉక్రెయిన్ యుద్ధవిమానాలను తాము పేల్చివేసినట్లు తీవ్రవాదులు ప్రకటించారు కూడా. దీంతో యుద్ధ విమానాలకే కాదు, పౌర విమానాలకు కూడా ఆ దేశ గగనతలం ప్రమాదకరంగా మారింది. కాగా.. అంతర్యుద్ధంతో కుతకుతలాడుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం మీ దుగా విమానాల రాకపోకలను నిలిపివేయాలని భారత వైమానిక సంస్థలు నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థల సలహా ప్రకారం తాము నడుచుకోనున్నట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు.
పతనమైన అమెరికా మార్కెట్లు..
రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఆంక్షలు విధించిన రోజే మలేసియా విమానాన్ని ఉక్రెయిన్‌లో కూల్చివేశారనే వార్త లు రావడంతో.. అమెరికా స్టాక్‌మార్కెట్లలో దడ పుట్టించింది. డౌజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ సూచీలన్నీ ప్రస్తుత సెషన్‌లో అతి తక్కువ స్థాయిని తాకాయి. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని మెరిడియన్ ఈక్విటీ ఎండీ జోసెఫ్ గ్రెసో మాట్లాడుతూ.. ‘మలేషియా విమానంఘటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ రోజే అమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించా రు. పలు హెచ్చరికలు కూడా చేశా రు. విమానం ఘటన నేపథ్యంలో ఇదో వివాదమయ్యే అవకాశముంది..’ అని వ్యాఖ్యానించారు.