ఎంత చదివినా ఇంగ్లిష్ రావడం లేదని..
తిరువాన్నమలై (తమిళనాడు): ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ 16 ఏళ్ల విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది. పదో తరగతి చదువుతున్న భవాని ఇంగ్లిష్ సబ్జెక్టులో తనకు తక్కువ మార్కులు రావడంతో బలవన్మరణానికి పాల్పడింది. గత సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది.
తిరువాన్నమలై పట్టణానికి చెందిన కష్టవలి, పుంగోడి దంపతుల కూతురైన భవాని స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఇంగ్లిష్‌పై తనకు పట్టు లేకపోవడంతో భవాని చాలాసార్లు తీవ్ర నిరాశ చెందింది. ఈ సబ్జెక్ట్ టెస్టుల్లోనూ తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేదని పలుసార్లు తోబుట్టువులకు చెప్పిందని, ఈ నేపథ్యంలోనే భవాని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.