మత ఘర్షణల నేపథ్యంలో కిష్ట్వార్ పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఎట్టి పరిస్థితుల్లో సడలించేది లేదని ఆ జిల్లా మేజిస్ట్రేట్ బషీర్ అహ్మద్ ఖాన్ బుధవారం స్పష్టం చేశారు. కర్ఫ్యూ సడలించిన పక్షంలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో విధించిన కర్ఫ్యూ నేటితో ఆరో రోజుకు చేరిందన్నారు.
గత ఆరు రోజులుగా విధించిన కర్ఫ్యూను ఒక్క సారి కూడా సడలించలేదన సంగతిని ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని తెలిపారు. అయితే పట్టణంలో విధించిన కర్ఫ్యూ వల్ల స్థానికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను విలేకర్ల బృందం స్థానికంగా పర్యటించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను కొంత సేపు సడలిస్తున్నారు.
ఆ సమయంలో స్థానికులు తమకు అవసరమైన నిత్యవసర సరకులను కొనుగోలు చేస్తున్నారని జమ్మూలోని ఉన్నతాధికారి వివరించారు. అయితే గురువారం జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక విద్యార్థులు ఎవరు ఆ వేడుకలకు హాజరుకాకుడదంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 సందర్భంగా ఏమైన ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆదికారులు వివరించారు.