రాజీనామా చేసి దేశం వీడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఢాకాకు నిరసనకారుల ‘లాంగ్ మార్చ్’
డిమాండ్లకు తలొగ్గి ప్రధాని పలాయనం
జనం సంబరాలు, సైన్యం చేతుల్లోకి దేశం
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు
హసీనా ఇంటిని, పార్లమెంటును ముట్టడించిన జనం
భారత్ చేరిన హసీనా, త్వరలో లండన్ వెళ్లే చాన్స్
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల ‘లాంగ్ మార్చ్’ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశ నలుమూలల నుంచీ రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు.
దాంతో ప్రజల డిమాండ్‌కు హసీనా తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రం పఠించారు. ఉన్నపళంగా దేశం వీడారు. సోదరితో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు. వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. ‘‘శాంతిభద్రతలతో పాటు
దేశ బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా. దయచేసి సహకరించండి’’ అని ప్రకటించారు. నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైన్యాన్ని, పోలీసు శాఖను ఆదేశించారు. ‘‘అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నిరసనకారులు ఆందోళన విరమించాలి’’ అని కోరారు. వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ వెంటనే పారీ్టలతో భేటీ అయ్యారు. తర్వాత ఆయా పారీ్టల నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు.
అధికార అవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి. మరోవైపు హసీనా దేశం వీడారన్న వార్తతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు. సర్వం లూటీ చేసి తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఆమె తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ విగ్రహాన్ని సుత్తెలతో పగలగొట్టి నేలమట్టం చేశారు. అధికార అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్లమెంటులోకీ చొరబడ్డారు.
పుట్టి ముంచిన రిజర్వేషన్లు
రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతుండటం తెలిసిందే. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్‌లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పుట్టి ముంచింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు.
కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమే కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా రాజీనామా డిమాండ్‌తో జనం మరోసారి రోడ్డెక్కారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్త ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. హసీనా సర్కారు ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహా్వనించినా ససేమిరా అన్నారు. దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు.
ఆ క్రమంలో, ‘యువత ముసుగులో సంఘవిద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నా’రంటూ ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. హసీనాను గద్దె దింపడమే లక్ష్యంగా ‘ఢాకా లాంగ్ మార్చ్’కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది. రిజర్వేషన్ల రగడ ఆమె 15 ఏళ్ల పాలనకు చివరికిలా తెరదించింది. నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణారి్థగా దేశం వీడాల్సి వచ్చింది!
ఆలయాల విధ్వంసం
హసీనా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు. ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. వాటిని పూర్తిగా లూటీ చేశారు. హసీనా భర్త డాక్టర వాజెడ్ మియా ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. దానికి నిప్పు పెట్టారు.
బంగబంధు స్మారక మ్యూజియంతో పాటు బంగ్లాదేశ్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం తదితర కీలక భవనాలకు కూడా నిప్పు పెట్టారు. దేశ ప్రధాన న్యాయమూర్తి నివాసంపైనా అల్లరి మూకలు దాడికి దిగాయి. కాసేపటికే ఇంట్లోంచి కేకలు, ఆక్రందనలు, మూలుగులు విని్పంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దేశవ్యాప్తంగా హింసాకాండ, ఆస్తుల విధ్వంసం తదితరాలు కొనసాగాయి. నాలుగు ఆలయాలను ధ్వంసం చేశారు. ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల నివాసాలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లపై రాళ్లు రువ్వారు. వాటికి నిప్పు పెట్టారు.
రన్‌వే మీదా వెంటాడిన జనం...
త్రుటిలో తప్పించుకున్న హసీనా
సైనిక విమానంలో సోదరితో కలిసి ఢిల్లీకి
ఉన్నపళంగా బంగ్లా వీడిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో, వెల్లువెత్తిన జనాగ్రహం బారినుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు! హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్‌వే మీదికి కూడా చేరుకున్నారు. అప్పటికే ఆమె, సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన సి–130జె రవాణా విమానం ఎక్కేశారు. దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు. కాసేపటికి వారిద్దరూ ఢిల్లీ సమీపంలో గాజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి. విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు.
హసీనాతో దోవల్ భేటీ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో హసీనాతో భేటీ అయ్యారు. వారు ఏం చర్చించిందీ తెలియరాలేదు. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజెద్‌ను కలిసిన అనంతరం హసీనా లండన్ వెళ్తారని సమాచారం. వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసినా ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
హసీనా ఇంటి ముట్టడి
సర్వం దోచుకెళ్లిన జనం
రెండేళ్ల క్రితం శ్రీలంక అంతర్యుద్ధం సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? అధ్యక్ష నివాసాన్ని ముట్టడించిన జనం భవనమంతా కలియదిరిగారు. అధ్యక్షుని కురీ్చలో విలాసంగా కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. సెలీ్పలు దిగారు. కిచెన్లో దూరి ఉన్నవన్నీ తింటూ సరదాగా గడిపారు. ఈత కొలనుల్లో ఈదులాడారు. సోమవారం ఢాకాలోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం వీడినట్టు తెలియగానే నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ఆమె అధికార నివాసం ‘గణభదన్’ను భారీ సంఖ్యలో ముట్టడించారు.
డ్రమ్ములు వాయిస్తూ, కొమ్ముబూరాలు ఊదుతూ విజయనాదం చేశారు. జాతీయ పతాకాలు చేబూని స్వేచ్ఛా నినాదాలు చేశారు. లాన్ల నిండా పరుగులు తీస్తూ, స్విమింగ్‌పూల్స్‌లో ఈదులాడుతూ, భవనమంతా కలియదిరుగుతూ హసీనాపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారు. భద్రతా సిబ్బందితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కొందరు ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. బెడ్రూంలో మంచంపై హాయిగా సేదదీరారు.
అంతటితో ఆగకుండా వంట సామగ్రి మొదలుకుని ఫరి్నచర్, పురాతన వస్తువుల దాకా సర్వం ఎత్తుకెళ్లారు. ఎవరికి ఏది చేతికందితే అది తీసుకెళ్లారు. భవనాన్ని పూర్తిగా లూటీ చేసి వదిలారు. ఒక వ్యక్తి లిప్‌స్టిక్‌లు చేతబట్టుకుని మీడియా కంటబడ్డాడు. ‘‘నియంత కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేశాం. మా పోరాటానికి ప్రతీకగా ఈ లిప్‌స్టిక్‌ను నా దగ్గరుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు! దేశ పార్లమెంటులోకి కూడా జనం వెల్లువలా దూసుకెళ్లారు. ప్రజాప్రతినిధురల కురీ్చల్లో కూర్చుని విలాసంగా పొగ తాగుతూ, సెల్పీలు తీసుకుంటూ గడిపారు.
ఇక తిరిగి రారు: కుమారుడు
లండన్: హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు సజీవ్ వాజెడ్ జాయ్ ప్రకటించారు. ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటే దేశం వీడారని బీబీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
ఖలేదా జియాకు విముక్తి
ఢాకా: జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలేదా జియాను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచిపెట్టిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చీఫ్ ఖలేదా జియాను తక్షణమే విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ హసీనా మొదటిసారిగా 1996లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఖలేదా జియా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రధాని కుర్చీ వారిద్దరి మధ్య మారుతూ వచ్చింది.
నిరసనలు ఇలా...
జూన్ 5: స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ కోర్టు తీర్పు
జూన్ 6: యూనివర్సిటీల్లో మొదలైన
ఆందోళనలు. దేశమంతటికీ వ్యాప్తి.
జూన్ 7: విద్యార్థుల రహదారుల దిగ్బంధం
జూన్ 15: పెరిగిన నిరసనల తీవ్రత
జూలై 15: హింసాత్మకంగా మారిన నిరసనలు
జూలై 18: ఆందోళనలు తీవ్రరూపం..19 మంది మృతి. కర్ఫ్యూ, రంగంలోకి సైన్యం
జూలై 19: దేశమంతటా హింస
జూలై 21: కోటాను 5 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
ఆగస్ట్ 3: మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ నిరసనలు
ఆగస్ట్ 4: దేశవ్యాప్త ఆందోళనల్లో మరో 100 మందికి పైగా మృతి. న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం. అయినా చల్లారని జనాగ్రహం
ఆగస్ట్ 5: ప్రధాని షేక్ హసీనా రాజీనామా. దేశం విడిచి పలాయనం
భారత్‌పై ప్రభావం ఎంత?!
బంగ్లా్లదేశ్ సంక్షోభం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హసీనా తొలి నుంచీ భారత్‌కు గట్టి మద్దతుదారు. ఆమె హయాంలో 15 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధం నానాటికీ దృఢమవుతూనే వస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని భారత వ్యతిరేకుల నోళ్లకు హసీనా గట్టిగా తాళం వేశారు. 2009లో ఆమె రెండోసారి గద్దెనెక్కినప్పుడు యూపీఏ–2 మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ఇరు దేశాల బంధం గట్టిపడింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక సంబంధాలు మరింతగా బలపడుతూ వచ్చాయి. మన ప్రబల ప్రత్యర్థి చైనాకు బంగ్లాదేశ్ మరీ దగ్గరవకుండా ఉండేందుకు పలు అంశాల్లో బంగ్లాకు ఇతోధికంగా సాయపడుతూ వచి్చంది.
ఖలీదా జియా హయాంలో ఇరు దేశాల మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయి. భారత వ్యతిరేకతే జియా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉంటూ వస్తోంది కూడా! బంగ్లాదేశ్ మేలు కంటే హసీనా, అవామీ లీగ్ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే భారత్‌కు ప్రధానమని ఆ దేశంలో ఒక వర్గంలో ఉన్న అభిప్రాయానికి ఆమె గట్టి సమర్థకురాలు. జియా హయాంలో ఉల్ఫా తీవ్రవాదులు బంగ్లా కేంద్రంగా ఈశాన్య భారతంలో ధ్వంసరచన చేశారు. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో సాగిన ‘బాయ్‌కాట్ భారత్’ ప్రచారానికి జియా, బీఎన్‌పీ నేతలు బాహాటంగా మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో జియా జైలు నుంచి విడుదలవడమే గాక సైన్యం దన్నుతో కూడిన మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించవచ్చన్న వార్తలు భారత్‌కు ఇబ్బందికరమే.
పరిస్థితిని సమీక్షించిన మోదీ
బంగ్లా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ సారథ్యంలో భద్రతపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. బంగ్లాలో తాజా పరిస్థితిని మోదీకి జైశంకర్ నివేదించారు.
సరిహద్దుల్లో అప్రమత్తత
బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్‌ఎఫ్ హై అలర్ట్ జారీ చేసింది. అదనపు బలగాలను మోహరించారు.
మన విద్యార్థులు వెనక్కి ..
బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెనక్కొస్తున్నారు. జూలై చివరికల్లా 2,894 మంది తిరిగొచ్చారు. మరో 3,000 మంది త్వరలో రానున్నట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment