విభజన బిల్లును వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగ కసరత్తులు ముమ్మరం చేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టే విషయంలో సందిగ్దం కొనసాగుతోంది. విభజన బిల్లును వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగ కసరత్తులు ముమ్మరం చేసింది. దీనిలో ఈ సాయంత్రం ప్రధాని నివాసంలో భాగంగా కేంద్ర కేబినెట్ సమావేశమయింది. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపింది.
తెలంగాణ బిల్లులో చేపట్టాల్సిన సవరణలపైనే ప్రధానంగా చర్చ సాగినట్టు సమాచారం. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్ర ప్రాంతంలో కలపాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలపై కేబినెట్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ప్రతిపాదించిన సవరణలపై కూడా కేబినెట్ చర్చించినట్టు సమాచారం. హోంశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టే విషయంలో అయోమయం కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. రేపే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశముందని హోంశాఖ వర్గాలు అంటున్నాయి. 18 తర్వాత ప్రవేశపెడతారని మరికొన్ని అధికార వర్గాలు పేర్కొంటున్నారు.