బాబూ.. ఇదేం తీరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టమైన వైఖరి చెప్పనప్పటికీ.. ఆ పార్టీ తెలంగాణ నేతల్లో హర్షం వ్యక్తమైంది. టీడీపీ ఇచ్చిన లేఖ కారణంగానే కేంద్రం విభజన నిర్ణయాన్ని తీసుకోగలిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో వారు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్న నేతలు పరస్పరం ఫోన్లు చేసుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. 2008లో పార్టీ సీనియర్ నేతలతో కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, దాన్ని కేంద్రానికి పంపించటంతో పాటు సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ప్రధానికి గతేడాది లేఖ రాయ టం వరకూ చంద్రబాబు చేసిన ప్రయత్నాలపట్ల పార్టీ ప్రతిష్ట పెరుగుతోందని వారు చెబుతున్నారు.
అయితే సీమాంధ్ర నేతలు.. కేంద్రం నిర్ణయంపై ఎలా స్పం దించాలో తెలియక చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిర్ణయాన్ని వ్యతిరేకించాలని సీమాంధ్ర నేతలు పలుసార్లు చంద్రబాబుకు చెప్పినా.. నిర్ణయంపై వెనక్కి వెళ్లేది లేదని బాబు స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ నేతలు చర్చించుకున్నారు. సీమాంధ్రలో గడిచిన 64 రోజులుగా సాగుతున్న ఉద్యమం తమకు ఇబ్బందికరంగా మారుతోందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చినప్పుడు... ఆ ఉద్యమంలో వారినీ పాల్గొనాలని సూచించారే తప్ప తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేశారు. కేబినెట్ నిర్ణయంపై ఎరబ్రెల్లి దయాకర్‌రావు హర్షం ప్రకటించారు.