అశ్లీల నృత్యాలపై కేంద్రమంత్రి విపరీత వ్యాఖ్యలు!
సాక్షాత్తు కేంద్రమంత్రి ప్రధాన అతిథిగా పాల్గొన్న ఓ వేడుకలో మహిళా డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ నయిన్‌పూర్ జిల్లాలోని పిప్రియా గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గోండు రాజులు శంకర్ షా, రఘునాథ్ షా సంస్మరణార్థం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలో డ్యాన్సర్లు అసభ్య, అశ్లీల నృత్యాలు చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేయడం వివాదం రేపింది.
అయితే, ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి, మధ్యప్రదేశ్ ఎంపీ ఫగన్ కులస్తే డ్యాన్సర్లను ప్రశంసించారు. గిరిజన సంస్కృతిలో ఇలాంటి డ్యాన్సులు భాగమని, ప్రజలు వీటిని ఇష్టపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాత్రుళ్లు ప్రజలు మెలుకువ ఉండటానికి ఇలాంటి డ్యాన్స్ ప్రదర్శనలు అవసరమని ఆయన అన్నారు. ఆయన గతంలో కూడా ఇలాంటి డ్యాన్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.