కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!
న్యూఢిల్లీ: తన సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి ఓ వ్యక్తి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ భార్య భారతీ సింగ్ ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ప్రదీప్ చౌహాన్ తమ కుటుంబానికి తెలిసినవాడని, ఆగస్టు 6న అతనితో తాను మాట్లాడిన మాటల్ని రహస్యంగా రికార్డు చేశాడని, ఆ తర్వాత తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే ఆ సంభాషణల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు చౌహాన్ వద్ద లైసెన్స్‌డ్ రివాల్వర్ ఉందని, దానితో తమ కుటుంబానికి హాని చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఆడియో, వీడియో రికార్డులను బయటపెడతానని చౌహాన్ ఆమె పేర్కొన్నారు. అతని దగ్గర ఉన్న క్లిప్పుల్లో ఏముందో తనకు తెలియదని, కానీ వాటిని బయటపెట్టి తన భర్త పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తానని అతడు ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. నిందితుడు ఆమె సంభాషణల్ని రికార్డు చేసి.. వాటిని వేరే వాటితో మిక్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి.