కాంగ్రెస్ పార్టీలో చేరిన నందన్ నీలేకని
న్యూఢిల్లీ: ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు నిన్న కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు కల్పించారు. నీలేకనికి దక్షిణ బెంగళూర్ లోక్ సభ నియోజకవర్గాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన అనంతరం నీలేకని కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికల సమరానికి 194 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు రూపొందించిన ఈ జాబితాలో కొత్తవారికి, యువకులతోపాటు సినీ, ఐటీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులకూ చోటు దక్కింది. జాబితాలో 28 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 35 శాతం టిక్కెట్లు 50 ఏళ్లలోపు వారికే దక్కాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.