
ఇఫ్తార్ విందును రద్దుచేసిన కాంగ్రెస్ పార్టీ
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) ప్రతియేటా నిర్వహించే ఇఫ్తార్ విందును రద్దుచేసింది. ఈ మేరకు సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇలా ఇఫ్తార్ను రద్దుచేయడం ఇదే మొదటిసారి. ఇందుకు కారణం ఏంటో అధికారికంగా చెప్పకపోయినా.. జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇక్కడ కూడా చేశారని అంటున్నారు. జూలై 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ హాజరు కావల్సి ఉంది.
అయితే.. ఇలా ఇఫ్తార్ విందును రద్దు చేయడం వల్ల మైనారిటీలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇప్పటివరకు అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీకి వాళ్ల ఓట్లే పడుతున్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ప్రశాంత కిషోర్ నేతృత్వంలోని బృందం రావడం వల్ల ఇప్పటికే పార్టీ బ్రాహ్మణ రంగు పులుముకున్నట్లు అయిందని, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో ఇలా చేయడం వల్ల మరింత నష్టం తప్ప లాభం ఏమీ ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇఫ్తార్ విందుకు పెట్టదలచిన మొత్తాన్ని ముస్లిం పిల్లల సంక్షేమం కోసం ఖర్చుపెడతామని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.