ట్రిపుల్ తలాఖ్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బస్తీ (ఉత్తరప్రదేశ్): ట్రిపుల్ తలాఖ్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ట్రిపుల్ తలాఖ్‌ను ఉపయోగించుకొని.. భార్యలను మారుస్తూ తమ ‘కామాన్ని’ సంతృప్తి పరుచుకుంటున్నారని అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌కు ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన కొట్టిపారేశారు.
‘ముస్లిం మహిళలకు బీజేపీ అండగా ఉంటుంది. ట్రిపుల్ తలాఖ్ అనేది అహేతుకమైనది. నిరంకుశమైనది. ఒక వ్యక్తి తన కోరికను సంతృప్తికోవడానికి తరచూ భార్యలను మార్చి.. సొంత భార్యాపిల్లలను వీధులపాలు చేసి అడ్డుక్కుతినమనడం సరైనది కాదు. దీనిని ఎవరూ ఒప్పుకోరు’ అని బస్తీలో శుక్రవారం ఆయన విలేకరులతో పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, దీనిపై పరిష్కారానికి ముస్లిం సామాజికవర్గం ముందుకురావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.