Swami Prasad Maurya
-
అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్‌కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు. తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు. -
‘కరసేవకులపై కాల్పులు సబబే’.. ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత, మాజీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన యూపీలోని కాస్గంజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు అరాచకవాదులను కాల్చిచంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు జారీ చేసిందని’ వ్యాఖ్యానించారు. అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు . అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Kasganj (UP): On Ram temple, Samajwadi Party leader Swami Prasad Maurya says, "...To safeguard the constitution and the law and to protect peace, the then government gave shoot at sight orders. The government merely did its duty..." pic.twitter.com/tpYf8wdMnJ — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2024 -
‘నేనెవరికీ భయపడి సీటు మారలేదు’
లక్నో: భారతీయ జనతా పార్టీ కిందటిసారి.. 2017 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 312 (మొత్తం 403) చోట్ల నెగ్గి ఉండొచ్చుగాని.. కానీ ప్రస్తుతం యూపీలో యోగి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఇటీవలే బీజేపీని వీడి... సమాజ్‌వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి, ప్రముఖ ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) నేత స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఉన్న బలం 47 సీట్లు మాత్రమేనని... మార్చి 10 (ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ) తర్వాత జరగబోయేది అదేనని స్వామి ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు. మరో ఇద్దరు ఓబీసీ మంత్రులు దారాసింగ్ చౌహాన్, ధరమ్‌సింగ్ సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్‌బై చెప్పడం యూపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో ఎస్పీకి అనుకూలంగా ఓబీసీ సామాజికవర్గాల పునరేకీకరణ విజయవంతంగా జరుగుతోందనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన 68 ఏళ్ల ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఇంటర్వ్యూ క్లుప్తంగా... ప్రశ్న:ఓబీసీలు పూర్తిగా ఎస్పీవైపు మళ్లినట్లేనా? జవాబు: మార్చి 10న ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓబీసీలు ఎటువైపు ఉన్నారనేది బీజేపీకి బాగా తెలిసొస్తుంది. ప్రశ్న: సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనిపై మీరేమంటారు? జవాబు: నేను సిద్ధాంతాలను నమ్ముకున్న వాడిన. పేదల బాగోగుల గురించి ఆలోచించే వాడిని. దళితులు, వెనుకబడినవర్గాల ప్రయోజనాలే నాకు ముఖ్యం. వీటికే నా ప్రాధాన్యం తప్పితే... నా రాజకీయ ఆకాంక్షలు, కెరీర్‌ను అంతగా పట్టించుకోను.అయినా డిప్యూటీ సీఎం ఎవరు, మంత్రులెవరు అనేది ప్రస్తుతం చర్చించాల్సిన అంశం కాదు. బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టి... కమలదళాన్ని అధికారానికి దూరంగా ఉంచడమనేదే అన్నింటికంటే ముఖ్యం. ప్రశ్న: కాంగ్రెస్‌లో నుంచి ఇటీవలే బీజేపీలోకి చేరిన ఆర్పీఎన్ సింగ్‌కు బయపడే మీరు సొంత నియోజకవర్గమైన ‘పద్రౌనా’ను వదిలి కుషీనగర్ జిల్లాలోని ఫాజిల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మారారా? జవాబు: నేను ఎక్కడి నుంచి పోటీచేయాలనేది ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. అంతేతప్ప ఆర్పీఎన్ సింగ్ బయపడి సీటు మారలేదు. (స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్పీఎన్ సింగ్‌ల మధ్య దశాబ్దాల రాజకీయ వైరముంది) ఫాజిల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరో విడతలో భాగంగా మార్చి 3 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రశ్న: బీజేపీ ‘సబ్కా సాథ్... సబ్కా వికాస్’ అంటూ సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకొని వెళతామని నమ్మబలుకుతోంది? జవాబు: అందరినీ కలుపుకొనే వెళతారు... కాకపోతే ముందుకెళ్లిన కొద్దీ పథకం ప్రకారం ఒక్కొక్కరినీ దెబ్బకొట్టేస్తారు. అందరి ప్రయోజనాలనూ కాపాడతామంటారు... ఆచరణకు వచ్చేసరికి వారికి కావాల్సిన కొందరి ప్రయోజనాలనే బహు జాగ్రత్తగా కాపాడతారు. ప్రశ్న: మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణను ఎలా చూస్తారు? జవాబు: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే అసలది సాధ్యమయ్యేదే కాదు. వారికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే.. ఉపసంహరణకు ముందే అన్నదాతలతో ఎందుకు చర్చించలేదు? -
స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్’
ఇటీవల ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడు ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ అధినేత మొండిచేయి ఇచ్చారు. 2017 ఎన్నికల్లో ఉంచహార్ నుంచి పోటీ చేసి 1,934 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ సీటు కేటాయిస్తారని ఊహాగానాల మధ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే మనోజ్ పాండే వైపే అఖిలేష్ మొగ్గు చూపారు. అయితే తొలి జాబితాలో స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న పండ్రౌనా స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ జస్వంత్‌నగర్ నుంచి పోటీకి దిగుతుండగా, రాంపూర్ స్వర్ నుంచి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగనున్నారు. -
ఎవరీ మౌర్య ?.. యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఆయన వెంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు నడవనున్నారు. స్వామి ప్రసాద్ రాజీనామా వార్త యూపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. బీజేపీని నిర్ఘాంతపర్చింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ ఆనందిబెన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘కార్మిక మంత్రిగా నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ యోగి కేబినెట్లో అంకిత భావంతో పని చేశాను. కానీ దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరగతి వ్యాపారుల్ని అణచివేస్తూ, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మౌర్య రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కాసేపటికే ముగ్గురు ఎమ్మెల్యేలైన రోషన్ లాల్ వర్మ, బ్రజేష్ ప్రజాపతి , భగవతి సాగర్ వినయ్ శాఖ్యలు తాము మౌర్యకు మద్దతుగా పార్టీని వీడుతామని ప్రకటించారు. మౌర్య ఏ పార్టీలో ఉంటే తాను అక్కడే ఉంటానని తిల్హర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మ చెప్పారు. తిండ్వారీ ఎమ్మెల్యే బ్రజేష్ ప్రజాపతి, బిల్హార్ ఎమ్మెల్యే భగవతి సాగర్ వెనుకబడిన వర్గాల గళమైన మౌర్య తమ నాయకుడని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ తొలి దశ (ఫిబ్రవరి 10న) ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తు చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీలో సమావేౖశమెన వేళ లక్నోలో మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అఖిలేశ్‌ను కలిసిన మౌర్య కేబినెట్‌కు రాజీనామా చేసిన వెంటనే మౌర్య నేరుగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను అఖిలేశ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేస్తూ పార్టీలోకి ఆయనకి స్వాగతం పలికారు. ‘‘సామాజిక న్యాయం సాధించడానికి మౌర్య నిరంతరం పాటుపడతారు. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. మౌర్యని, ఇతర నాయకుల్ని, వారి మద్దతుదారుల్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను’’ అని అఖిలేశ్ ట్వీట్ చేశారు. ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా అణగారిన వర్గాలన్నీ ఏకమవుతున్నాయని, ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం పలికారు. మంగళవారం జరిగిన పరిణామాలు సమాజ్‌వాదీ శ్రేణులకు నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నేనేంటో తెలుస్తుంది: మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మౌర్య విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు అందరికీ స్వామి ప్రసాద్ అంటే ఎవరో తెలిసి వస్తుందని అన్నారు. తాను ఎక్కడ ఉంటే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్వామి ప్రసాద్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ట్విట్టర్ వేదికగా కోరారు. తొందర పాటు నిర్ణయాలు ఎప్పుడూ తప్పు అవుతాయని, ఒక్కసారి అందరం కలిసి కూర్చొని చర్చిద్దామని కోరారు. ఎవరీ మౌర్య ? మౌర్య అత్యంత శక్తిమంతమైన ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) నాయకుడు. మౌర్య, కుషావా వర్గాల్లో అపారమైన పట్టు ఉంది. అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఇతర వెనుకబడిన వర్గాల వారిని ఆకర్షించడానికి, సమాజ్‌వాదీ పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేవారు. 2016లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీలో టిక్కెట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ పార్టీకి గుడ్ బై కొట్టారు. ఆ తర్వాత సొంతంగా లోక్తాంత్రిక్ బహుజన్ మంచ్ అనే సంస్థని స్థాపించి ప్రజల్లోనే ఉంటూ పట్టు నిలుపుకున్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పడ్రౌనా నుంచి శాసనసభకి ఎన్నికై కార్మిక మంత్రి అయ్యారు. మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీలోనే ఎంపీగా ఉన్నారు. ఆమె బదౌన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మౌర్య నిష్క్రమణ 20 నియోజకవర్గాల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఖుషీనగర్, ప్రతాప్‌గఢ్, కాన్సూర్ దెహత్, బండా, షాహజాన్పూర్ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. నాన్న ఏ పార్టీలో చేరలేదు.. మౌర్య ఏ పార్టీలో చేరలేదని ఆయన కూతురు, బదౌన్ బీజేపీ ఎంపీ సంఘమిత్ర అన్నారు. రెండు రోజుల్లో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను, వ్యూహాన్ని వెల్లడిస్తారని చెప్పారు. కాగా బిదునా ఎమ్మెల్యే వినయ్ శాఖ్యను బలవంతంగా తమ కుటుంబసభ్యులే లక్నోకు పట్టుకెళ్లారని ఆయన కూతురు రియా శాఖ్య ఆరోపించారు. తన తండ్రికి 2018లో బ్రెయిన్ సర్జరీ జరిగిందని, తర్వాత ఆయన ఆలోచనా శక్తి కూడా క్షీణించిందని ఆమె తెలిపారు. చదవండి: (గోవా బీజేపీకి షాక్) -
ట్రిపుల్ తలాఖ్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బస్తీ (ఉత్తరప్రదేశ్): ట్రిపుల్ తలాఖ్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ట్రిపుల్ తలాఖ్‌ను ఉపయోగించుకొని.. భార్యలను మారుస్తూ తమ ‘కామాన్ని’ సంతృప్తి పరుచుకుంటున్నారని అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌కు ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన కొట్టిపారేశారు. ‘ముస్లిం మహిళలకు బీజేపీ అండగా ఉంటుంది. ట్రిపుల్ తలాఖ్ అనేది అహేతుకమైనది. నిరంకుశమైనది. ఒక వ్యక్తి తన కోరికను సంతృప్తికోవడానికి తరచూ భార్యలను మార్చి.. సొంత భార్యాపిల్లలను వీధులపాలు చేసి అడ్డుక్కుతినమనడం సరైనది కాదు. దీనిని ఎవరూ ఒప్పుకోరు’ అని బస్తీలో శుక్రవారం ఆయన విలేకరులతో పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, దీనిపై పరిష్కారానికి ముస్లిం సామాజికవర్గం ముందుకురావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీలోకి స్వామిప్రసాద్ మౌర్య..!?
లక్నోః ఇటీవల పార్టీకి రాజీనామాచేసిన బహుజన సమాజ్ వాద్ పార్టీ మాజీ నాయకుడు, పడ్రౌనా ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలోని తన మద్దతుదారులు సహా కొంతమంది మాజీ పార్టీ నాయకులతోపాటు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బహుజన సమాజ్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ స్వామిప్రసాద్ మౌర్య.. జూన్ 22న మాయావతి పార్టీకి రాజీనామా చేశారు. మాయావతి పార్టీ టికెట్లను వేలం వేస్తున్నారని, దళితులను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష నేత అయిన స్వామి ప్రసాద్ మౌర్య.. 2017 ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవని, పార్టీ విజయంకోసం మంచి అభ్యర్థులను ఎంపిక చేయకుండా.. డబ్బు ఎక్కువగా ఇచ్చినవారికి మాయావతి పార్టీ టికెట్లు వేలం వేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం మౌర్య.. తన మద్దతుదారులతోపాటు ఢిల్లీవెళ్ళి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అదే విషయాన్ని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. శివ్ పూర్ ఎమ్మెల్యే ఉడియాలాల్ సహా కొందరు మాజీ బీఎస్పీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మౌర్య బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పయనమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజీపే ఫుల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్యను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన బీజేపీకి.. స్వామి ప్రసాద్ చేరికతో ఉత్తర ప్రదేశ్ లో అన్నివిధాలుగా కలసివచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. -
మౌర్యపై అఖిలేష్ ప్రశంసల జల్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీఎస్పీ నుంచి బయటికి వచ్చిన ఆపార్టీ ప్రతిపక్ష నేత స్వామిప్రసాద్ మౌర్యపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన సరైన వ్యక్తి అని ఇన్నాళ్లూ తప్పుడు పార్టీలోఉన్నారని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ ఈ వాఖ్యలు చేశారు. మౌర్య బలమైన నాయకుడని, ఆయనతో తనకు ముందు నుంచీ మంచి సంబంధాలున్నాయని అన్నారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 27 న జరుగునున్న మంత్రి వర్గ విస్తరణలో మౌర్య చేరనున్నాడనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2017 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటినుంచే మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని, మాయావతి అసలు దళితురాలే కాదని ఆరోపిస్తూ మౌర్య బీఎస్పీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
'మాయావతి దళితురాలు కాదు'
'మాయావతి దళిత్ నహీ, దౌలత్ కి బేటీ హై' (మాయావతి దళితురాలు కాదు).. అంటూ సీనియర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య మాయావతిపై ధ్వజమెత్తారు. బీఎస్పీ తరఫున ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఎస్పీలో చేరుతారని భావిస్తున్న మౌర్య బీఎస్పీకి రాజీనామా చేసిన సందర్భంగా మాయావతిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల టికెట్లను ఆమె ఇప్పుడే వేలంలో అమ్మేస్తున్నారని ఆరోపించారు. వెళ్లిపోయాడు.. అదే ఆనందం! మరోవైపు సీనియర్ నేత మౌర్య పార్టీని వీడటంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తనపై చేసిన విమర్శలను కొట్టిపారేశారు. పార్టీని వీడటం ద్వారా మౌర్య బీఎస్పీకి గొప్ప మేలు చేశాడని, ఇది పార్టీకి మేలు చేస్తుందని అన్నారు. మౌర్య తన పిల్లలకు టికెట్లు అడిగాడని, బీఎస్పీ వారసత్వ రాజకీయాలను ఎంతమాత్రం అంగీకరించబోదని, అందుకే అతన్ని పార్టీ నుంచి గెంటేద్దామని అనుకుంటుండగానే.. ఆయనే వెళ్లిపోయాడని ఆమె పేర్కొన్నారు. -
ఎన్నికలకు ముందు మాయావతికి ఝలక్!
లక్నో: వచ్చే ఏడాది కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ ప్రతిపక్ష నేత, బీఎస్పీ సీనియర్ నాయకుడు, పార్టీ శాసనసభాపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు మాయావతి రానున్న అసెంబ్లీ ఎన్నికల టికెట్లను వేలం వేస్తున్నారని, ఈ నేపథ్యంలో తాను ఎంతమాత్రం పార్టీలో కొనసాగలేనని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న మౌర్య అధికార సమాజ్ వాదీ పార్టీలో చేరవచ్చునని తెలుస్తోంది. ఈ నెల 27న సీఎం అఖిలేశ్ యాదవ్ చేపట్టనున్న కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించవచ్చునని వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నేత మౌర్య బీఎస్పీని వీడటం.. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతికి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు. 'నాకు పార్టీలో ఊపిరి సలుపని పరిస్థితి కల్పించారు. నేను ఇక పార్టీలో ఎంతమాత్రం కొనసాగబోను. మాయావతి స్వయంగా టికెట్లను వేలం వేస్తున్నారు. ఆమె సొంత నిర్ణయం ప్రకారమే ఇప్పటినుంచి టికెట్ల కేటాయింపు జరుగుతోంది. ఆమె సరైన అభ్యర్థులను ఎంచుకోవడం లేదు'అంటూ బుధవారం హడావిడిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మౌర్య పేర్కొన్నారు. ఈ సమావేశంలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.