![Swami Prasad Maurya New Party Speculation - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/19/swamy-prasad.jpg.webp?itok=4RzvzHa7)
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.
స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
అఖిలేష్ యాదవ్‌కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు.
తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment