'మాయావతి దళితురాలు కాదు'
'మాయావతి దళిత్ నహీ, దౌలత్ కి బేటీ హై' (మాయావతి దళితురాలు కాదు).. అంటూ సీనియర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య మాయావతిపై ధ్వజమెత్తారు. బీఎస్పీ తరఫున ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఎస్పీలో చేరుతారని భావిస్తున్న మౌర్య బీఎస్పీకి రాజీనామా చేసిన సందర్భంగా మాయావతిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల టికెట్లను ఆమె ఇప్పుడే వేలంలో అమ్మేస్తున్నారని ఆరోపించారు.
వెళ్లిపోయాడు.. అదే ఆనందం!
మరోవైపు సీనియర్ నేత మౌర్య పార్టీని వీడటంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తనపై చేసిన విమర్శలను కొట్టిపారేశారు. పార్టీని వీడటం ద్వారా మౌర్య బీఎస్పీకి గొప్ప మేలు చేశాడని, ఇది పార్టీకి మేలు చేస్తుందని అన్నారు. మౌర్య తన పిల్లలకు టికెట్లు అడిగాడని, బీఎస్పీ వారసత్వ రాజకీయాలను ఎంతమాత్రం అంగీకరించబోదని, అందుకే అతన్ని పార్టీ నుంచి గెంటేద్దామని అనుకుంటుండగానే.. ఆయనే వెళ్లిపోయాడని ఆమె పేర్కొన్నారు.