లక్నో: భారతీయ జనతా పార్టీ కిందటిసారి.. 2017 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 312 (మొత్తం 403) చోట్ల నెగ్గి ఉండొచ్చుగాని.. కానీ ప్రస్తుతం యూపీలో యోగి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఇటీవలే బీజేపీని వీడి... సమాజ్‌వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి, ప్రముఖ ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) నేత స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఉన్న బలం 47 సీట్లు మాత్రమేనని... మార్చి 10 (ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ) తర్వాత జరగబోయేది అదేనని స్వామి ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు.
మరో ఇద్దరు ఓబీసీ మంత్రులు దారాసింగ్ చౌహాన్, ధరమ్‌సింగ్ సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్‌బై చెప్పడం యూపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో ఎస్పీకి అనుకూలంగా ఓబీసీ సామాజికవర్గాల పునరేకీకరణ విజయవంతంగా జరుగుతోందనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన 68 ఏళ్ల ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఇంటర్వ్యూ క్లుప్తంగా...
ప్రశ్న:ఓబీసీలు పూర్తిగా ఎస్పీవైపు మళ్లినట్లేనా?
జవాబు: మార్చి 10న ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓబీసీలు ఎటువైపు ఉన్నారనేది బీజేపీకి బాగా తెలిసొస్తుంది.
ప్రశ్న: సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?
జవాబు: నేను సిద్ధాంతాలను నమ్ముకున్న వాడిన. పేదల బాగోగుల గురించి ఆలోచించే వాడిని. దళితులు, వెనుకబడినవర్గాల ప్రయోజనాలే నాకు ముఖ్యం. వీటికే నా ప్రాధాన్యం తప్పితే... నా రాజకీయ ఆకాంక్షలు, కెరీర్‌ను అంతగా పట్టించుకోను.అయినా డిప్యూటీ సీఎం ఎవరు, మంత్రులెవరు అనేది ప్రస్తుతం చర్చించాల్సిన అంశం కాదు. బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టి... కమలదళాన్ని అధికారానికి దూరంగా ఉంచడమనేదే అన్నింటికంటే ముఖ్యం.
ప్రశ్న: కాంగ్రెస్‌లో నుంచి ఇటీవలే బీజేపీలోకి చేరిన ఆర్‌పీఎన్ సింగ్‌కు బయపడే మీరు సొంత నియోజకవర్గమైన ‘పద్రౌనా’ను వదిలి కుషీనగర్ జిల్లాలోని ఫాజిల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మారారా?
జవాబు: నేను ఎక్కడి నుంచి పోటీచేయాలనేది ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. అంతేతప్ప ఆర్‌పీఎన్ సింగ్ బయపడి సీటు మారలేదు. (స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్‌పీఎన్ సింగ్‌ల మధ్య దశాబ్దాల రాజకీయ వైరముంది) ఫాజిల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరో విడతలో భాగంగా మార్చి 3 తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
ప్రశ్న: బీజేపీ ‘సబ్‌కా సాథ్... సబ్‌కా వికాస్’ అంటూ సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకొని వెళతామని నమ్మబలుకుతోంది?
జవాబు: అందరినీ కలుపుకొనే వెళతారు... కాకపోతే ముందుకెళ్లిన కొద్దీ పథకం ప్రకారం ఒక్కొక్కరినీ దెబ్బకొట్టేస్తారు. అందరి ప్రయోజనాలనూ కాపాడతామంటారు... ఆచరణకు వచ్చేసరికి వారికి కావాల్సిన కొందరి ప్రయోజనాలనే బహు జాగ్రత్తగా కాపాడతారు.
ప్రశ్న: మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణను ఎలా చూస్తారు?
జవాబు: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే అసలది సాధ్యమయ్యేదే కాదు. వారికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే.. ఉపసంహరణకు ముందే అన్నదాతలతో ఎందుకు చర్చించలేదు?
Comments
Please login to add a commentAdd a comment