ఎన్నికలకు ముందు మాయావతికి ఝలక్!
లక్నో: వచ్చే ఏడాది కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ ప్రతిపక్ష నేత, బీఎస్పీ సీనియర్ నాయకుడు, పార్టీ శాసనసభాపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు మాయావతి రానున్న అసెంబ్లీ ఎన్నికల టికెట్లను వేలం వేస్తున్నారని, ఈ నేపథ్యంలో తాను ఎంతమాత్రం పార్టీలో కొనసాగలేనని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న మౌర్య అధికార సమాజ్ వాదీ పార్టీలో చేరవచ్చునని తెలుస్తోంది. ఈ నెల 27న సీఎం అఖిలేశ్ యాదవ్ చేపట్టనున్న కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించవచ్చునని వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నేత మౌర్య బీఎస్పీని వీడటం.. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతికి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.
'నాకు పార్టీలో ఊపిరి సలుపని పరిస్థితి కల్పించారు. నేను ఇక పార్టీలో ఎంతమాత్రం కొనసాగబోను. మాయావతి స్వయంగా టికెట్లను వేలం వేస్తున్నారు. ఆమె సొంత నిర్ణయం ప్రకారమే ఇప్పటినుంచి టికెట్ల కేటాయింపు జరుగుతోంది. ఆమె సరైన అభ్యర్థులను ఎంచుకోవడం లేదు'అంటూ బుధవారం హడావిడిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మౌర్య పేర్కొన్నారు. ఈ సమావేశంలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.