ఎవరీ మౌర్య ?.. యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ | Uttar Pradesh Minister Swami Prasad Maurya Quits BJP, Joins SP | Sakshi
Sakshi News home page

ఎవరీ మౌర్య ?.. యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ

Published Tue, Jan 11 2022 4:21 PM | Last Updated on Wed, Jan 12 2022 4:35 PM

Uttar Pradesh Minister Swami Prasad Maurya Quits BJP, Joins SP - Sakshi

లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్‌ మౌర్య మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఆయన వెంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు నడవనున్నారు. స్వామి ప్రసాద్‌ రాజీనామా వార్త యూపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.

బీజేపీని నిర్ఘాంతపర్చింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌ ఆనందిబెన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.  ‘కార్మిక మంత్రిగా నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ యోగి కేబినెట్‌లో అంకిత భావంతో పని చేశాను. కానీ దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరగతి వ్యాపారుల్ని అణచివేస్తూ,  క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మౌర్య రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కాసేపటికే ముగ్గురు ఎమ్మెల్యేలైన రోషన్‌ లాల్‌ వర్మ, బ్రజేష్‌ ప్రజాపతి , భగవతి సాగర్‌ వినయ్‌ శాఖ్యలు తాము మౌర్యకు మద్దతుగా పార్టీని వీడుతామని ప్రకటించారు. మౌర్య ఏ పార్టీలో ఉంటే తాను అక్కడే ఉంటానని తిల్హర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మ  చెప్పారు. తిండ్వారీ ఎమ్మెల్యే బ్రజేష్‌ ప్రజాపతి, బిల్హార్‌ ఎమ్మెల్యే భగవతి సాగర్‌ వెనుకబడిన వర్గాల గళమైన మౌర్య  తమ నాయకుడని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ తొలి దశ (ఫిబ్రవరి 10న) ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తు చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీలో సమావేౖశమెన వేళ లక్నోలో మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.  

అఖిలేశ్‌ను కలిసిన మౌర్య  
కేబినెట్‌కు రాజీనామా చేసిన వెంటనే మౌర్య నేరుగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను అఖిలేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేస్తూ పార్టీలోకి ఆయనకి స్వాగతం పలికారు. ‘‘సామాజిక న్యాయం సాధించడానికి మౌర్య నిరంతరం పాటుపడతారు. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. మౌర్యని, ఇతర నాయకుల్ని, వారి మద్దతుదారుల్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను’’ అని అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు. ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా అణగారిన వర్గాలన్నీ ఏకమవుతున్నాయని, ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం పలికారు. మంగళవారం జరిగిన పరిణామాలు సమాజ్‌వాదీ శ్రేణులకు నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు నేనేంటో తెలుస్తుంది: మౌర్య
మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత  మౌర్య విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు అందరికీ స్వామి ప్రసాద్‌ అంటే ఎవరో తెలిసి వస్తుందని అన్నారు. తాను ఎక్కడ ఉంటే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్వామి ప్రసాద్‌ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు. తొందర పాటు నిర్ణయాలు ఎప్పుడూ తప్పు అవుతాయని, ఒక్కసారి అందరం కలిసి కూర్చొని చర్చిద్దామని కోరారు.  

ఎవరీ మౌర్య ?
మౌర్య అత్యంత శక్తిమంతమైన ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) నాయకుడు. మౌర్య, కుషావా వర్గాల్లో అపారమైన పట్టు ఉంది. అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఇతర వెనుకబడిన వర్గాల వారిని ఆకర్షించడానికి,  సమాజ్‌వాదీ పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేవారు. 2016లో మాయావతికి చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీలో టిక్కెట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ పార్టీకి గుడ్‌ బై కొట్టారు.

ఆ తర్వాత సొంతంగా లోక్‌తాంత్రిక్‌ బహుజన్‌ మంచ్‌ అనే సంస్థని స్థాపించి ప్రజల్లోనే ఉంటూ పట్టు నిలుపుకున్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పడ్రౌనా  నుంచి శాసనసభకి ఎన్నికై కార్మిక మంత్రి అయ్యారు. మౌర్య కుమార్తె సంఘమిత్ర బీజేపీలోనే ఎంపీగా ఉన్నారు. ఆమె బదౌన్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మౌర్య నిష్క్రమణ 20 నియోజకవర్గాల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఖుషీనగర్, ప్రతాప్‌గఢ్, కాన్సూర్‌ దెహత్, బండా, షాహజాన్‌పూర్‌ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి.  

నాన్న ఏ పార్టీలో చేరలేదు..
మౌర్య ఏ పార్టీలో చేరలేదని ఆయన కూతురు, బదౌన్‌ బీజేపీ ఎంపీ సంఘమిత్ర అన్నారు. రెండు రోజుల్లో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను, వ్యూహాన్ని వెల్లడిస్తారని చెప్పారు. కాగా బిదునా ఎమ్మెల్యే వినయ్‌ శాఖ్యను బలవంతంగా తమ కుటుంబసభ్యులే లక్నోకు పట్టుకెళ్లారని ఆయన కూతురు రియా శాఖ్య ఆరోపించారు. తన తండ్రికి  2018లో బ్రెయిన్‌ సర్జరీ జరిగిందని, తర్వాత ఆయన ఆలోచనా శక్తి కూడా క్షీణించిందని ఆమె తెలిపారు.
చదవండి: (గోవా బీజేపీకి షాక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement