
మారిజువానా డ్రగ్ ఇక చట్టబద్ధం!!
హెరాయిన్, కొకైన్, కీటమైన్, మారిజువానా.. ఇవన్నీ మత్తు కలిగించే డ్రగ్స్. వీటిలో మారిజువానాను బహిరంగ మార్కెట్లో అమ్ముకోడానికి ఉరుగ్వే అనుమతించింది. దాని అమ్మకాలను చట్టబద్ధం చేస్తూ ఆ దేశం ఓ చట్టాన్ని ఆమోదించింది. దీంతో మారిజువానా సాగు, పంపిణీ, వినియోగం అన్నీ ఇక ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగుతాయి. ఆఫ్రికన్ దేశాలలో డ్రగ్స్ అమ్మకాలు, నేరాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రణలో పెట్టేందుకే ఇలా చేస్తున్నట్లు ఆ చట్టంలో చెప్పారు. దీనికి సంబంధించిన బిల్లును 16-13 ఓట్ల తేడాతో ఆమోదించారు. పాలకపక్షమైన బ్రాడ్ ఫ్రంట్ పార్టీ బిల్లును పూర్తిగా సమర్థించింది. ఇక అధ్యక్షుడు జోస్ మూజికా ఆమోదముద్ర పడితే చాలు.. దానికి చట్టరూపం వచ్చేస్తుంది.
ఈ చట్టం అమలులోకి వచ్చిందంటే ఉరుగ్వే పౌరులంతా ఎంచక్కా మారిజువానాను పెంచుకోవచ్చు, కొనుగోలు చేయచ్చు, పీల్చుకోవచ్చు. రైతులకు, అమ్మకందారులు, వినియోగదారులకు కూడా ప్రభుత్వం లైసెన్సులు జారీచేస్తుంది. అయితే.. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం 40 గ్రాముల మారిజువానా కొనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే, ఇంట్లో కావాలనుకుంటే ఆరు మొక్కల వరకు పెంచుకోవచ్చు. అదే నమోదు చేసుకున్న క్లబ్బులైతే 99 మొక్కలు పెంచచ్చు. అనుమతి లేకుండా వీటిని పెంచినా, అమ్మినా, తీసుకెళ్లినా మాత్రం జైలుశిక్ష తప్పదట!!