చైనా వార్నింగ్ బేఖాతరు.. రంగంలోకి అమెరికా!
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. నేరుగా అమెరికా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి దిగింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ విమాననౌక శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలో గస్తీ తిరగడం ప్రారంభించింది. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (సీఎస్‌జీ) 1 యుద్ధవిమాన నౌక ఈ మేరకు సాధారణ గస్తీ చేపడుతున్నదని ఆ దేశ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధనౌకలో నిమిట్జ్ క్లాస్ ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్ (USS Carl Vinson (CVN 70)), క్షిపణి విధ్వంసక యూఎస్‌ఎస్ వేన్ ఈ మేయర్, ఎయిర్‌వింగ్‌కు చెందిన యుద్ధవిమానం తదితర అత్యాధునిక యుద్ధ సామాగ్రి ఉంది.
చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే సాహసానికి ఒడిగట్టవద్దని ఇప్పటికే డ్రాగన్ హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం గంపగుత్తగా తనదేనని మొండిగా వాదిస్తున్న చైనా.. ఈ విషయంలో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులు, సముద్రజలాల్లో తమకు కూడా హక్కులు ఉన్నాయని కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం భావిస్తున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ జలాలు ఉన్నాయని, ఈ జలాల మీదుగా అంతర్జాతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా తాము రంగంలోకి దిగామని అమెరికా అంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రం విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ గతవారం చైనా విదేశాంగశాఖ ఒక హెచ్చరిక జారీచేసింది.