US Navy
-
విశాఖలో అమెరికా నేవీ (ఫొటోలు)
-
ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్‌లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు -
అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్
వాషింగ్టన్: అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్ లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ గనుక బైడెన్ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. జో బైడెన్ ప్రతిపాదన అయితే చేశారు కానీ అందుకు యూఎస్ సెనేట్ ఆమోదించాల్సి అవసరముంది. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో అమెరికా కాంగ్రెస్ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలుంటాయి. కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి వన్నె తీసుకొస్తూ అమెరికా నావికా దళానికి విశేష సేవలందించారు. ప్రస్తుతం ఆమె అమెరికా నావికా దళానికి వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లీసా అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమింపబడిన రెండో అధికారి. ఒకవేళ ఆమె నియామకంపై సెనెట్‌లో గ్రీన్ సిగ్నల్ వస్తే అమెరికా నావీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తొట్టతొలి మహిళగా నిలుస్తారన్నారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నాను. దేశఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని అనుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై.. -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్‌పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్‌లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
ఇరాన్ అక్రమ ఆయుధ రవాణాకు అమెరికా చెక్
దుబాయ్: ఇరాన్ నుంచి యెమెన్‌కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. ఒమన్, పాకిస్తాన్ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కలష్నికోవ్ తరహా రైఫిళ్లు, మెషీన్ గన్స్, రాకెట్ గ్రనేడ్ లాంచర్లతోపాటు దాదాపు 2.3 లక్షల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. చాన్నాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ ఓకేన్ యుద్ధ నౌకలోకి ఎక్కించి, చేపల పడవను సముద్రంలో ముంచేశారు. -
కొనసాగుతున్న మలబార్ విన్యాసాలు
దొండపర్తి(విశాఖ దక్షిణ): అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో నిర్వహిస్తున్న మలబార్ రెండో దశ విన్యాసాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం జరిగిన ప్రదర్శనలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రన్విజయ్(డీ55), ఐఎన్ఎస్ సత్పుర (ఎఫ్ 48) నౌకలు పాల్గొన్నాయి. వీటితో పాటు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ యూఎస్ఎస్ కారల్ విన్సన్, జపనీస్ హెలికాఫ్టర్ కారియర్ జేఎస్.. ఇలా తొమ్మిది యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. యూఎస్ నేవీ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ మైఖిల్ గిల్డే సతీసమేతంగా బుధవారం తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన తూర్పునావికాదళపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
ఇండియన్ నేవీలోకి రోమియోలొచ్చేశాయ్, ప్రత్యేకతలివే!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిత్య ఘర్షణలతో దేశ భద్రత సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన బహుళ ప్రయోజనాలు కలిగే ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు 24లో రెండు భారత్‌కి అందించింది. దీంతో దేశ నావికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. అగ్రరాజ్యంలో శుక్రవారం శాన్‌డియోగోలో నేవల్ ఎయిర్ స్టేషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రెండింటిని భారత్‌కు లాంఛనంగా అప్పగించింది. ఈ కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తారాంజిత్ సింగ్ సాంధు, అమెరికా నేవల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నెత్ వైట్సెల్, భారత్ కమాండర్ రవ్నీత్ సింగ్, హెలికాఫ్టర్లు తయారు చేసిన లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీటి చేరికతో అమెరికా, భారత్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైందని సాంధు అన్నారు. ఆకాశమే హద్దుగా అమెరికా, భారత్ స్నేహబంధం సాగిపోతోందని ఆయన ట్వీట్ చేశారు. గత నెలరోజులుగా హెలికాఫ్టర్ల వాడకంపై భారత్‌కు చెందిన 20 మంది అ«ధికారులు, సాంకేతిక నిపుణులకు అమెరికాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టం 2020 ఫిబ్రవరిలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించిన సేల్స్‌లో భాగంగా 24 హెలికాప్టర్లని 240 కోట్ల డాలర్లు (ఇంచుమించుగా 18 వేల కోట్లు ) భారత్ కొనుగోలు చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్ చుట్టూ జలాంతర్గాముల్ని మోహరించింది. దీంతో ఇలాంటి అత్యాధునికమైన హెలికాప్టర్లు మన దగ్గర ఉండే అవసరం ఉందని భారత్ గుర్తించింది. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి సీ కింగ్ హెలికాఫ్టర్లు మన దగ్గర ఉన్నాయి. అవి కదన రంగంలో మనకి ఉపయోగపడడం లేదు. దీంతో వాటిని కేవలం రవాణా అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ల రాకతో మన త్రివిధ బలగాలు మరింత బలోపేతం కానున్నాయి. హెలికాప్టర్ ప్రత్యేకతలు ► ఈ హెలికాప్ట్టర్ల పూర్తి పేరు ఎంహెచ్రోమియో సీహాక్ ► ప్రముఖ రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఈ హెలికాఫ్టర్లకు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవని పేరుంది ► వీటిని యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ ఆయుధంగా కూడా వాడవచ్చు. అంటే త్రివిధ బలగాల్లోనూ వీటిని వినియోగించుకోవచ్చు ► హెల్ఫైర్ క్షిపణులు, ఎంకే 54 టార్పెడోస్లను మోసుకుపోగలిగే సామర్థ్యం దీని సొంతం ► ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించడానికి అత్యాధునిక సెన్సార్లు, రాడార్లు వాడారు. ► సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకల కదలికల్ని పసిగట్టి దాడులు చేయగలదు ► జలాంతర్గాముల్ని కూడా వెంటాడి ధ్వంసం చేసేలా డిజైన్ని రూపొందించారు ► గంటకి 267కి.మీ. వేగంతో దూసుకుపోతుందిప్రకృతి విపత్తుల సమయాల్లో ఈ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవచ్చు ► సైనికులకు అవసరమయ్యే సామగ్రినిసరిహద్దులకి తరలించవచ్చు ► ప్రస్తుతం ఈ హెలికాప్టర్లను అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు మాత్రమే వినియోగిస్తున్నాయి. -
అమెరికన్ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్ఓలు
వాషింగ్టన్: యూఎఫ్ఓల (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికి ఆసక్తే. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓలను చూశామని ప్రకటించారు. వీరి వ్యాఖ్యలను నమ్మే వారు ఎందరుంటారో.. కొట్టి పారేసేవారు కూడా అంతే మంది ఉంటారు. ఈ క్రమంలో యూఎఫ్ఓలు ఉన్నాయనే వాదనకు బలం చేకూర్చింది అమెరికన్ నేవీ. కొద్ది రోజుల క్రితం యూఎస్ నేవీ యూఎఫ్ఓలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2019లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అమెరికన్ నేవీ తెలిపింది. ఈ క్రమంలో పరిశోధనాత్మక చిత్రాల దర్శకుడు జెరెమీ కోర్బెల్ అదే సంఘటనకు సంబంధించిన మరో వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 యూఎఫ్ఓలు ఉన్నాయి. ఇవి అమెరికన్ నేవీ యుద్ధ నౌక ఒమాహాను చుట్టుముట్టినట్లు కోర్బెల్ తెలిపాడు. వీటి వేగం గంటకు 70-250 కిలోమీటర్ల వరకు ఉందని.. ఒమాహాతో పోల్చితే మూడు రెట్లు వేగవంతమైనవని కోర్బెల్ వెల్లడించాడు. రాడార్ స్క్రీన్ మీద ఈ యూఎఫ్ఓలు కనిపించాయన్నాడు కోర్బెల్. 2019 US Navy warships were swarmed by UFOs; here's the RADAR footage that shows that. Filmed in the Combat Information Center of the USS Omaha / July 15th 2019 / this is corroborative electro-optic data demonstrating a significant UFO event series in a warning area off San Diego. pic.twitter.com/bZS5wbLuLl — Jeremy Corbell (@JeremyCorbell) May 27, 2021 కోర్బెల్ ప్రకారం, ఈ వీడియోను ఓడ కమాండ్ సెంటర్లో చిత్రీకరించారని.. ఫుటేజ్‌ని ఇంకా వర్గీకరించలేదన్నాడు. ఇతను గతంలో అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా టాస్క్ ఫోర్స్(యూఏపీటీఎషఫ్) దగ్గర ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వీటిని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. పెంటగాన్ ప్రతినిధి సుసాన్ గోఫ్ ఏప్రిల్‌లో ది బ్లాక్ వాల్ట్‌తో మాట్లాడుతూ.. "యూఏపీటీఎఫ్ ఈ సంఘటనలను వారి కొనసాగుతున్న పరీశోధనలలో చేర్చింది" అని వెల్లడించారు. మే 15 న కోర్బెల్ షేర్ చేసిన వీడియోలో, “గోళాకార” యూఎఫ్ఓ ఒకటి సముద్రంలో అదృశ్యమైనట్లు పెంటగాన్ మరోసారి ధ్రువీకరించింది. కోర్బెల్ గతంలో విడుదల చేసిన ఫుటేజ్ ప్రామాణికమైనదని.. టాస్క్ ఫోర్స్ యూఎఫ్ఓల కదలికలను పరిశీలిస్తున్నట్లు అమెరిక రక్షణ శాఖ తెలిపింది. చదవండి: ‘‘ఏలియన్స్ నన్ను 50 సార్లు కిడ్నాప్ చేశారు’’ -
యుద్ధ వాతావరణం.. నౌకా విన్యాసం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో జరుగుతున్న 24వ మలబార్ విన్యాసాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. భారత యుద్ధ నౌకలు మరోసారి తమ సత్తా చాటాయి. అండమాన్ సముద్ర జలాల్లో నిర్వహించిన విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)కి చెందిన నౌకలు చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ అద్భుత ప్రదర్శన కనబర్చాయి. -
మలబార్ 2020 విన్యాసాలు
-
చైనాకు 'చెక్' లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ రీజియన్‌పై పట్టు సాధిస్తూ.. శత్రు దేశం చైనా కుటిల యత్నాలకు, దాని దూకుడుకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తున్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. రెండున్నర దశాబ్దాలుగా భారత్, యూఎస్, జపాన్ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మలబార్ యుద్ధ విన్యాసాల్లో ఈసారి రాయల్ ఆస్ట్రేలియా నౌకాదళం జత కలిసింది. మంగళవారం ప్రారంభమైన 24వ మలబార్ విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకూ తొలి దశ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఆ తరువాత ఇదే నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మలబార్ రెండో దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నట్టు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తోపాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్ కాంటాక్ట్–ఎట్ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ వ్యవస్థల్ని పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి జత కట్టినట్టు ఆయా దేశాల నౌకాదళ వర్గాలు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు భారత్ తరఫున విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన యూఎస్ఎస్ జాన్ మెక్‌కైన్, హెచ్‌ఎంఎఎస్ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి. యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలతో సత్తా చాటాయి. నాలుగు దేశాల యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ.. విన్యాసాలకు తెర తీశాయి. భారత్–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992 నుంచి మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు నిర్వహించారు. -
నేటి నుంచి మలబార్–2020 ఎక్సర్సైజ్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సమన్వయాన్ని పెంపొందించడానికి భారత నావికాదళం తన సముద్ర మిత్ర దేశాలతో కలిసి మంగళవారం నుంచి జరిగే మలబార్–2020 ఉమ్మడి నావికాదళ వ్యాయామంలో పాల్గొననుంది. 2 దశల్లో జరగనున్న ఈ ఎక్సర్సైజ్లో యూఎస్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)లతో కలిసి సంయుక్తంగా భారత నావికాదళం సముద్రంలో కసరత్తులు చేయనుంది. మలబార్–2020 మొదటి దశ ఈనెల 3 నుంచి 6 వరకు విశాఖ తీరంలో జరగనుంది. -
కాల్చిపారేయండి: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగిలతే ఇరాన్ నౌకలను ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చారు. ‘మా ఓడలకు అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్ గన్బోట్లను కాల్చిపారేసి ధ్వంసం చేసేయ్యాలని అమెరికా నావికా దళానికి ఆదేశాలు ఇచ్చాన’ని ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగిస్తున్న అమెరికా నావికాదళ నౌకలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) ప్రయత్నిస్తోందన్న వార్తల నేప్యథంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఉత్తర అరేబియా సముద్రంలో ఐఆర్‌జీసీకి చెందిన 11 నౌకలు పదేపదే అమెరికా ఓడలకు అడ్డుతగులుతూ ప్రమాదకరంగా సంచరిస్తున్నాయి. ఓడలు పరస్పరం ఢీకొట్టుకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడతామ’ని హెచ్చరిస్తూ అమెరికా నేవీ ఈనెల 16న ట్వీట్ చేసింది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. అసత్య సమాచారంతో తమకు వ్యతిరేకంగా హాలీవుడ్ కథలు చెబుతోందని అమెరికాపై మండిపడింది. వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..! -
ఆ ఆపరేషన్‌తో ఇక కొత్త జీవితం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా నౌకా దళానికి చెందిన ‘రే’ (పూర్తి పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడ లేదు) 2010లో అఫ్ఘానిస్థాన్‌లో సైనిక విధులు నిర్వర్తించారు. ఆ సందర్భంగా ఓ రోజు పొరపాటున రోడ్డు పక్కన తాలిబన్లు అమర్చిన మందు పాతర మీద కాలు పెట్టారు. అది పేలి పోవడంతో రెండు కాళ్లు తెగి పోయాయి. ఆయన్ని హుటిన అమెరికాలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆయన రెండు కృత్రిమ కాళ్లను అమర్చుకొని నడవడం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆయన లోలోల ఎందుకో కుములి పోసాగారు. ఆ తర్వాత కొంత కాలానికి అతి సన్నిహితులకు అసలు విషయం చెప్పారు. నాటి బాంబు పేలుడులో తన పురుషాంగం, బీజావయ సంచీ పూర్తిగా దెబ్బతిన్నాయని, వైద్యులు వాటిని ఆపరేషన్లలో తీసివేశారని ‘రే’ చెప్పుకున్నారు. ఇక తనకు సంసార సుఖం లేనట్లేనా ? అంటు బాధ పడ్డారు. పేలుడు జరిగినప్పుడు ‘రే’ వయస్సు 30 ఏళ్లు. ఈ విషయం వెల్లడించినప్పుడు ఆయన వయస్సు 33 ఏళ్లు. పురుషాంగం మార్పిడికి అవకాశం ఉందా ? అన్న అంశంపై అప్పటి నుంచి వైద్యులను సంప్రతించడం మొదలు పెట్టారు. 2013లోనే బాల్టిమోర్‌లోని ‘జాన్ హాప్కిన్స్ మెడిసిన్’ ఆస్పత్రిలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రిచర్డ్ రెడిట్‌ను కలుసుకున్నారు. తన బాధ గురించి ఆయనకు చెప్పుకున్నారు. పురుషాంగం దాత దొరికనప్పుడు తప్పకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రపంచలో ఎవరు కూడా పురుషాంగం మార్పిడి ఆపరేషన్ చేయక పోవడంతో డాక్టర్ కూడా ఆ విషయం అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ‘రే’ ఆ తర్వాత ఐదేళ్లకు 2018లో మేరీలాండ్ రాష్ట్రంలో మెదడు చచ్చుపడిన ఓ రోగి పురుషాంగం దానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మేరీలాండ్ నుంచి బాల్టిమోర్‌కు అద్దె జెట్ విమానంలో అవయవాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆపరేషన్‌కు సిద్ధం చేసిన ‘రే’కు 14 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పురుషాంగాన్ని అతికించారు. అలాంటి ఆపరేషన్ ప్రపంచంలో విజయవంతం అవడం అదే మొదటి సారి. దాంతో ఆ వైద్య బృందానికి అంతర్జాతీయంగా ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా మూడంటే మూడే పురుషాంగం మార్పిడి ఆపరేషన్లు విజయవంతం అయ్యాయి. 2006లో చైనా వైద్యు పురుషాంగం మార్పిడికి మొదటి సారి ప్రయత్నించి విఫలమయ్యారు. పురుషాంగంలో తల వెంట్రుకలకన్నా సన్నని రక్త నాళాలతోపాటు, సంక్లిష్టమైన రక్త నాళాల వ్యవస్థ ఉంటుందట. అందుకనే ఆపరేషన్ చాలా క్లిష్టమట. ‘రే’కు పురుషాంగంతోపాటు బీజాల సంచిని కూడా దాత నుంచే సేకరించి అతికించారు. సంచిలోని బీజాలను మాత్రం తొలగించారు. బీజాల్లోనే ‘వీర్యం’ ఉత్పత్తి అవుతుంది కనుక, వాటిని కూడా అమర్చినట్లయితే సంతానం దాతకు చెందినది అవుతుందన్న భావంతో కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని బీజాలను తొలగించారు. వాటి స్థానంలో కృత్రిమ బీజాలను అమర్చే అవకాశం ఉంది. అలా చేశారా, లేదా అన్నది తెలియలేదు. ఈ విషయాన్ని ‘రే’ కూడా వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా తన పురుషాంగం స్తంభిస్తోందని, వైద్య సహాయం లేకుండానే తాను మూత్రం పోయగలుగుతున్నానని ఆయన చెప్పారు. లైంగిక వాంఛ ఉద్దీపన కోసం తనకు వైద్యులు ‘టెస్టోస్టెరోమ్’ ఎంజైమ్ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటి నుంచి తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని, ఈ అవకాశం కల్పించిన వైద్య బృందానికి తన ధన్యవాదాలని ‘మిట్ టెక్నాలజీ రివ్యూ’ మాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రే’ ఈ వివరాలు వెల్లడించారు. ‘రే’ తనకు పెళ్లయిందో, లేదో వెల్లడించలేదు. అయితే ఆయన కొత్త సంసార జీవితాన్ని సంపూర్ణంగా ఆశిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని చిక్కుముడులు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదు. కృత్రిమ బీజాలు అమర్చకపోతే ఆయనలో ‘వీర్యం’ ఉత్పత్తి అవకాశమే లేదు. కృత్రిమ బీజాలు అమర్చినా సక్సెస్ రేటు తక్కువే. వీర్యం ఉత్పత్తి లేకున్నా పురుషాంగం స్తంభిస్తుందని, లైంగిక వాంఛ తీర్చు కోవచ్చని, అయితే ‘స్కలనం’ ఉండదని వైద్యులు తెలిపారు. ఫలితంగా ‘రే’కు స్కలనానుభూతి దక్కదన్న విషయం సన్నిహితులెవరూ ఆయనకు చెప్పలేదని అర్థం అవుతుంది. -
యూఎస్ నేవీ స్కాంలో భారత మహిళ
సింగపూర్: అమెరికా నావికాదళ చరిత్రలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఓ కుంభకోణంలో భారత సంతతి మహిళ చిక్కుకుంది. ఆమెకు మూడేళ్లకు పైగా జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. సింగపూర్‌లో అమెరికా నేవీ సప్లయి సిస్టమ్స్ కమాండ్ ఫ్లీట్ లాజిస్టిక్ సెంటర్ కోసం ‘లీడ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్’గా పనిచేస్తున్న షరన్ రఛేల్ గురుశరణ్ కౌర్‌కు రూ.238 కోట్ల (3.5 కోట్ల అమెరికన్ డాలర్ల) విలువైన ‘ఫాట్ లియోనార్డ్’ కుంభకోణంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కౌర్‌కు రూ.65 లక్షలకు పైగా ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. -
చైనా హ్యాకర్ల చేతిలో అమెరికా నేవీ వివరాలు
వాషింగ్టన్: అమెరికా నౌకాదళం (నేవీ)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చైనా ప్రభుత్వ హ్యాకర్లు భారీస్థాయిలో చోరీ చేశారు. అమెరికా తయారుచేయబోయే కొత్త రకం జలాంతర్గాముల రహస్య సమాచారం సహా పలు కీలక వివరాలు చైనా హ్యాకర్లు సంపాదించారు. చోరీకి గురైన మొత్తం సమాచార పరిమాణం 614 జీబీ ఉంటుందనీ, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో హ్యాకింగ్ జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. సీ డ్రాగన్ అనే రహస్య ప్రాజెక్టు వివరాలు, సిగ్నళ్లు, సెన్సర్ల సమాచారం, సముద్రగర్భంలో యుద్ధానికి సంబంధించిన పలు వివరాలు చైనా హ్యాకర్ల చేతికి వెళ్లాయని ఓ అధికారి చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
ఐదడుగుల దూరంలో దూసుకెళ్లిన రష్యన్ విమానం
వాషింగ్టన్ : మరోసారి అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య ప్రమాదం తప్పింది. దాదాపు ఈ రెండు జెట్ విమానాలు ఒకే మార్గంలో ప్రయాణించాయి. అది కూడా దాదాపు 2గంటల 40 నిమిషాలపాటు. ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని, దాదాపు తమ విమానాన్ని ఢీకొట్టినంత పని రష్యా యుద్ధ విమానం చేసిందని పెంటగాన్ అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఈపీ-3 అనే గూఢచర్యం నిర్వంహించే విమానం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్ నిఘా మిషన్‌లో భాగంగా ఎగురుతుండగా సరిగ్గా అదే మార్గంలో రష్యాకు చెందిన సుఖోయ్-27 యుద్ధ విమానం కూడా అమెరికా విమానం పక్కనే ఎగిరింది. అది కూడా ఎంత దగ్గరగా అంటే కేవలం ఐదు అడుగుల దూరంలో(1.5మీటర్లు) మాత్రమే. ఒకానొక దశలో ఈపీ-3 విమానం వెళ్లే మార్గంలోనే అతిదగ్గరగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో అమెరికన్ విమానం రష్యా విమానానికి రాసుకుపోయేంత పనైంది. సరిగ్గా నల్ల సముద్రంపైన ఎగురుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. -
కార్గో నౌకతో అమెరికా యుద్ధ నౌక ఢీ
వాషింగ్టన్: అమెరికా నేవికి చెందిన యుద్ధనౌక ఒకటి జపాన్ సముద్ర తీరంలో ఓ కార్గో నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది అమెరికా నేవీ సిబ్బందితోపాటు కార్గో సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వేకువ జామున 2.30 గంటల 3.00గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జపాన్‌లోని యోకోసుఖాకు 56 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికాకు చెందిన ఫిట్జరాల్డ్ అనే ఓ క్షిపణి విధ్వంసక నౌక, పిలిప్పీన్స్ జెండాను కలిగిన ఏసీఎక్స్ క్రిస్టల్ అనే కార్గో నౌక సరిగ్గా 2.30గంటల ప్రాంతంలో అతి సమీపంగా వచ్చాయని ఆ సమాయంలోనే ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నట్లు అమెరికాకు చెందిన ఏడో నేవీ దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ద నౌకలో దాదాపు 330మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల ఓ చోట రంధ్రం ఏర్పడి నీరు లోపలికి వస్తుందని, దాన్ని తాము నియంత్రించగలమని చెప్పారు. -
జనాలను పిట్టల్లా తొక్కించేశాడు!
న్యూయార్క్: డ్రగ్స్ మత్తులో అమెరికా నేవీ మాజీ ఉద్యోగి రద్దీ రోడ్డుపై హల్చల్ చేశాడు. మనుషులను పిట్టల్లా తొక్కిస్తూ తన కారును నడిపి భయోత్పాతం సృష్టించిన ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ భయానక ఘటనలో ఓ యువతి మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. న్యూయార్క్ సిటీలోని రద్దీ ప్రాంతం టైమ్స్ స్కేర్ సమీపంలోని 42 స్ట్రీట్‌లో మద్యం సేవించిన, డ్రగ్స్ తీసుకున్న యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి రిచర్డ్ రోజస్ కారు నడుపుతున్నాడు. సిగ్నల్ వద్ద యూ టర్న్ తీసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉన్నా కొన్ని సెకన్లలో అక్కడ భీకర వాతావరణం సృష్టించాడు. కారు ఛేజ్ బ్యాంకు వద్దకు రాగానే రోడ్డుపై వెళ్తున్న దాదాపు 10 మందిపైకి దూసుకెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు.. మూడుసార్లు జనాలపైకి కారును నడిపిన నేవీ వెటరన్.. పిట్టాల్లా మనుషులను తొక్కించేశాడు. ఓవరాల్‌గా 30 మందిని ఢీకొడుతూ కారును తన ఇష్టరీతిన నడపడంతో పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ 18 ఏళ్ల యువతి మృతిచెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిపోయేందుకు పరుగెత్తుతున్న నిందితుడిని కొందరు వ్యక్తుల సాయంతో న్యూయార్క్ పోలీసులు నిందితుడు రిచర్డ్‌ను అరెస్ట్ చేశారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది ఉగ్రవాదల చర్య కాదని, మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన తప్పిదమన్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు రిచర్డ్‌పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. -
చైనా వార్నింగ్ బేఖాతరు.. రంగంలోకి అమెరికా!
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. నేరుగా అమెరికా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి దిగింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ విమాననౌక శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలో గస్తీ తిరగడం ప్రారంభించింది. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (సీఎస్జీ) 1 యుద్ధవిమాన నౌక ఈ మేరకు సాధారణ గస్తీ చేపడుతున్నదని ఆ దేశ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధనౌకలో నిమిట్జ్ క్లాస్ ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్ (USS Carl Vinson (CVN 70)), క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ వేన్ ఈ మేయర్, ఎయిర్‌వింగ్‌కు చెందిన యుద్ధవిమానం తదితర అత్యాధునిక యుద్ధ సామాగ్రి ఉంది. చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే సాహసానికి ఒడిగట్టవద్దని ఇప్పటికే డ్రాగన్ హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం గంపగుత్తగా తనదేనని మొండిగా వాదిస్తున్న చైనా.. ఈ విషయంలో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులు, సముద్రజలాల్లో తమకు కూడా హక్కులు ఉన్నాయని కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం భావిస్తున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ జలాలు ఉన్నాయని, ఈ జలాల మీదుగా అంతర్జాతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా తాము రంగంలోకి దిగామని అమెరికా అంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రం విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ గతవారం చైనా విదేశాంగశాఖ ఒక హెచ్చరిక జారీచేసింది. -
ఈ ఏడాదిలో ఒక సెకను అదనం!
వాషింగ్టన్: 2016 సంవత్సరం ఒక సెకను కాలంపాటు ఎక్కువగా ఉండబోతోంది. కొత్త ఏడాదికి ముందు ఒక లీపు సెకనును ఈ సంవత్సరానికి కలపనుండటమే ఇందు కు కారణం. వాషింగ్టన్ డీసీలోని ‘యూఎస్ నావల్ అబ్జర్వేటరీస్ మాస్టర్ క్లాక్ ఫెసిలిటీ’వద్ద డిసెంబరు 31న యూటీసీ (కో–ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్) కాలమానం ప్రకారం సమయం 23:59:59 సెకన్లు ఉన్నప్పుడు లీపు సెకనును కలుపుతారు. అంటే భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల 59 సెకన్లు ఉన్నప్పుడు ఆ ఒక్క సెకను అదనంగా కలుస్తుంది. -
యూఎస్ నావికా స్థావరంలో కలకలం
టోక్యో: జపాన్‌లోని యూఎస్ నావికా స్థావరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ జపాన్‌లోని ససెబొలో ఉన్న ఈ స్థావరంలో గురువారం ఉదయం కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే నావల్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. నావల్ బేస్ భద్రతా సిబ్బందికి బిల్డింగ్ నెంబర్ 141లో కాల్పుల శబ్దం వినిపించినట్లు సమాచారం అదడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే బిల్డింగ్‌ను ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం దీనిపై వివరణ ఇస్తూ.. కాల్పులు చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఎవరికీ గాయాలు కాలేదని తెలుపుతూ లాక్డౌన్ ఎత్తేశారు. -
చివరి రోజుల్లో లాడెన్ పట్టుబడతానని భయపడ్డాడా?
వాషింగ్టన్: ఉగ్రవాదానికి చిరునామాగా నిలిచి... ప్రపంచదేశాల్లో అనేక దాడులు చేసిన మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ తాను స్థాపించి, నడిపిన సంస్థ ఆల్-ఖైదాను ముందుకు తీసుకువెళ్లడానికి , పరిపాలించడానికి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ? తన భార్య వద్దే ట్రాకింగ్ కు సంబంధించిన వస్తువు ఉందని భయపడ్డాడా ? అవుననే సమాధానం. 2011లో పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. వాటిలో లాడెన్ ఉత్తరప్రత్యురాలు జరిపిన కొన్ని పత్రాలను నేవీ మంగళవారం విడుదల చేసింది. లేఖల్లోని అంశాలు : సూడన్ దేశంలో తనకు దాదాపు 29 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయని ఒక వేళ తాను మరణిస్తే ఆ డబ్బును జీహాద్ కోసం వినియోగించాలని లాడెన్ లేఖలో పేర్కొన్నాడు. తన చివరిరోజుల్లో అమెరికా డ్రోన్ ఆల్-ఖైదా స్థావరాలపై దాడి చేసిన తర్వాత నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడని ఒక ఉత్తరంలో ఉంది. తన నివాసాన్ని ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కడ భద్రతా దళాలు పసిగడతాయోనని , తన భార్య పంటికి శస్త్రచికిత్స చేసిన ఇరానీయన్ డాక్టర్ పంటిలో ఏదైనా ట్రాకింగ్ పరికరం అమర్చారేమోనని వెతికినట్టు మరో ఉత్తరంలో ఉంది. ఎక్కవ కాలం ట్రాకింగ్ గురించి భయపడినట్లు తెలిపే మరో సంఘటన జిహాద్ అవసరాల కోసం తరలిస్తున్న డబ్బు సూట్ కేసుల్లో ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందని లాడెన్ అనుమానించే వాడు. జీపీఎస్ పరికరంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ను తీసుకుని వస్తానని చెప్పిన ఖతార్ కు చెందిన వ్యక్తి తనకు షుగర్ ఉందని డాక్టరు వద్దకు వెళ్లాలని చెప్పి రాకుండా వెళ్లిపోవడం లాడెన్ కు తీవ్రఅనుమానంగా తోచింది. -
అమెరికా-చైనా ముఖాముఖి
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ముందుకురికించడానికి ఏం చేయాలా అన్న అంశంపై చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నేతలంతా మథనపడుతుంటే దక్షిణ చైనా సముద్ర జలాల్లో అమెరికా మంట రాజేసింది. 'ప్రపంచ పోలీసు'గా తన పాత్రను వదులుకోబోనని మరోసారి చెప్పింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా నౌకాయానం చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని తెలియజేస్తూ 'ఫ్రీడం ఆఫ్ నావిగేషన్' పేరిట రెండు నౌకలనూ...వీటికి తోడుగా నిఘా విమానాన్ని పెట్టుకుని అమెరికా నావికా దళం ఈ విన్యాసాలు కానిచ్చింది. ఈ రెండు నౌకాల్లో ఒకటి క్షిపణి విధ్వంసక నౌక. దీన్నంతా చైనా చూస్తూ ఊరుకోలేదు. అమెరికాను తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్‌లోని అమెరికా రాయబారిని పిలిచి నిరసనను తెలియజేసింది. రాగల కాలంలో ఆసియాలో ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయో ఈ మొత్తం ఉదంతం తెలియజెబుతోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో కల్లోల భరిత వాతావరణం అలుముకుని ఉండటం ఇది మొదటిసారి కాదు. చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఇండొనేసియా దేశాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో చాలా భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అక్కడున్న చిన్న చిన్న దీవులు, పగడాల దిబ్బలు, ఇసుక మేటలు దాదాపు 700 వరకూ ఉన్నాయి. ఇవన్నీ గొలుసు కట్టుగా కూడా లేవు. విసిరేసినట్టుగా అక్కడక్కడ ఉండే వీటన్నిటినీ కలిపి స్ప్రాట్లీ దీవులంటారు. బ్రిటన్‌కు చెందిన కెప్టెన్ రిచర్డ్ స్ప్రాట్లీ 19వ శతాబ్దం మొదట్లో తొలిసారి వీటిని కనుగొన్నాడంటూ ఆయన పేరిట వ్యవహరించడం మొదలుపెట్టారు. అయితే ఆయన కనుక్కొనడానికి చాలాముందే... క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ప్రాచీన చైనా రాజ వంశాలకు చెందినవారు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయి. 19వ శతాబ్దంనాటికి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు యూరపియన్ల నియంత్రణలో ఉండటంవల్ల కావొచ్చు...ఆ దీవులు ఎందుకు పనికిరానివన్న అభిప్రాయంతో కావొచ్చు చైనా కూడా వాటిని పట్టించుకోలేదు. వియత్నాంపై పెత్తనం చలాయించిన కాలంలో ఫ్రాన్స్ ఈ దీవుల్లో కొన్నిటిని తన అధీనంలో ఉంచుకున్నది. ఆ రకంగా ఈ దీవులు తమవేనని వియత్నాం అంటుంటే...తమకు సమీపంలో ఉన్నాయి గనుక అవి తమకే చెందుతాయని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. నాలుగేళ్లక్రితమే ఈ దీవులన్నీ తమవేనని చైనా ప్రకటించి, అందుకొక చట్టం కూడా తెచ్చింది. ఆ ప్రాంతం మీదుగా విదేశీ నౌకలు వెళ్తే వెళ్లొచ్చుగానీ తనిఖీలకు ఒప్పుకోవాలని, అక్కడ నిలపడం, లంగరేయటం నిషిద్ధమని ఆ చట్టం చెబుతోంది. మరోపక్క అక్కడ కృత్రిమ దీవుల నిర్మాణాన్ని చురుగ్గా సాగిస్తోంది. భౌగోళికంగా చూస్తే ఈ దీవులు కీలకమైనవి. ప్రధాన నౌకా రవాణా మార్గంగా ఉన్న ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటే భవిష్యత్తులో తమదే పైచేయి కాగలదని చైనా అంచనా వేసుకుంది. దీనికి ఇంధన వనరుల అన్వేషణ కూడా తోడైంది. దక్షిణ చైనా సముద్ర గర్భంలో అపారమైన చమురు, సహజ వాయు నిక్షేపాలున్నాయి. ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటే కొన్ని దశాబ్దాలపాటు ఇంధన రంగంలో తిరుగులేని శక్తిగా మారడానికి వీలవుతుందని చైనా భావించబట్టే ఆ ప్రాంతం గురించి అంత పట్టుదలగా ఉంది. సరిగ్గా ఈ కారణాలవల్లే ఈ ప్రాంతంపై అమెరికా కన్ను పడింది. చైనా ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి, ఇంధనరంగంలో అది మరింతగా ఎదగడానికి, రక్షణపరంగా అభేద్యం కావడానికి తోడ్పడే దీవుల్ని అలా కళ్లప్పగించి వదిలేయడం అమెరికా స్వభావానికే విరుద్ధం. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని డీగోగార్షియా దీవుల్ని బ్రిటన్‌తో కలిసి అది సొంతం చేసుకున్న తీరే ఇందుకు ఉదాహరణ. అక్కడ మానవమాత్రులుండటానికే వీలు కాదని, మూలవాసులుగా చెప్పుకుంటున్న ఓ వందమంది, అప్పుడప్పుడు అక్కడకు రాకపోకలు సాగించే మరికొందరూ తప్ప దాన్లో ఎవరూ లేరని ప్రపంచాన్ని మభ్యపెట్టి ఆ దీవుల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. క్రమేపీ ఆ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మార్చారు. ఇప్పుడు దక్షిణ చైనా సముద్ర ప్రాంత దీవులపై ఎవరి ఆధిపత్యం ఏర్పడినా జరిగేది ఇదే. నిజానికి చైనా దూకుడువల్ల మన దేశానికి కూడా భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇప్పటికే పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు నౌకాశ్రయాలను నిర్మించడంద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్‌ను దిగ్బంధించడానికి చైనా ఏర్పాట్లు చేసుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో నాలుగేళ్లక్రితం వియత్నాం అభ్యర్థన మేరకు చమురు వెలికితీత పనుల్ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని పరోక్షంగా హెచ్చరించి వాటిని అడ్డుకుంది. అటు రష్యాతో వచ్చిన వివాదంలో తలమునకలు కావడంవల్లనో, మరే కారణంవల్లనో అమెరికా ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మొదట్లో తొలిసారి అమెరికా దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తమ నౌకా దళ విన్యాసముంటుందని గత కొంత కాలంగా అమెరికా లీకులిస్తోంది. గత నెలలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సైతం ఇది కొనసాగింది. ఇటు చైనా కూడా అధికారికంగా స్పందించలేదు. అక్కడ అమెరికా విన్యాసాలు చూశాకే కఠిన పదజాలంతో విరుచుకు పడింది. ఆ ప్రాంతంపై తమకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉన్నదని ప్రకటించింది. అక్కడ తమ కృత్రిమ నిర్మాణాలవల్ల అంతర్జాతీయ రవాణా మార్గానికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తబోవని చెబుతూనే దీవుల జోలికొస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించింది. ఏతా వాతా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఉద్రిక్తతలకు నెలవు కాబోతున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆధిపత్య ధోరణులతో, అంతులేని దురాశతో చేసే పనులవల్ల ఘర్షణలు రాజుకోవడమే కాదు...పర్యావరణం సైతం సర్వ నాశనమవుతుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం మరో డీగోగార్షియా కాకూడదని శాంతి కాముకులు ఆశిస్తారు. -
కుప్పకూలిన అమెరికా నేవీ జెట్ విమానం
అమెరికా నౌకాదళానికి చెందిన ఎఫ్-18 జెట్ విమానం ఒకటి సఫోక్లోని లాకెన్‌హీత్ ఆర్ఏఎఫ్ వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. సైనిక స్థావరానికి సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఈ విమానం కూలింది. కేంబ్రిడ్జిషైర్ - సఫోక్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఎమర్జెన్సీ సర్వీసులను వెంటనే పంపారు. ప్రస్తుతానికి తమకు కూడా వివరాలు ఏమీ తెలియలేదని కేంబ్రిడ్జిషైర్ పోలీసు అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పుడు అంతా అగమ్యగచరంగా ఉందని, అయితే ఈ విమానం మాత్రం సింగిల్ సీటర్ అని మాత్రం తెలిసిందని అన్నారు.