వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేసింది.
ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్‌లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు.
ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి.
ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
Comments
Please login to add a commentAdd a comment