మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ముందుకురికించడానికి ఏం చేయాలా అన్న అంశంపై చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నేతలంతా మథనపడుతుంటే దక్షిణ చైనా సముద్ర జలాల్లో అమెరికా మంట రాజేసింది. 'ప్రపంచ పోలీసు'గా తన పాత్రను వదులుకోబోనని మరోసారి చెప్పింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా నౌకాయానం చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని తెలియజేస్తూ 'ఫ్రీడం ఆఫ్ నావిగేషన్' పేరిట రెండు నౌకలనూ...వీటికి తోడుగా నిఘా విమానాన్ని పెట్టుకుని అమెరికా నావికా దళం ఈ విన్యాసాలు కానిచ్చింది. ఈ రెండు నౌకాల్లో ఒకటి క్షిపణి విధ్వంసక నౌక. దీన్నంతా చైనా చూస్తూ ఊరుకోలేదు. అమెరికాను తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్‌లోని అమెరికా రాయబారిని పిలిచి నిరసనను తెలియజేసింది. రాగల కాలంలో ఆసియాలో ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయో ఈ మొత్తం ఉదంతం తెలియజెబుతోంది.
దక్షిణ చైనా సముద్ర జలాల్లో కల్లోల భరిత వాతావరణం అలుముకుని ఉండటం ఇది మొదటిసారి కాదు. చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఇండొనేసియా దేశాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో చాలా భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అక్కడున్న చిన్న చిన్న దీవులు, పగడాల దిబ్బలు, ఇసుక మేటలు దాదాపు 700 వరకూ ఉన్నాయి. ఇవన్నీ గొలుసు కట్టుగా కూడా లేవు. విసిరేసినట్టుగా అక్కడక్కడ ఉండే వీటన్నిటినీ కలిపి స్ప్రాట్లీ దీవులంటారు. బ్రిటన్‌కు చెందిన కెప్టెన్ రిచర్డ్ స్ప్రాట్లీ 19వ శతాబ్దం మొదట్లో తొలిసారి వీటిని కనుగొన్నాడంటూ ఆయన పేరిట వ్యవహరించడం మొదలుపెట్టారు. అయితే ఆయన కనుక్కొనడానికి చాలాముందే... క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ప్రాచీన చైనా రాజ వంశాలకు చెందినవారు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయి.
19వ శతాబ్దంనాటికి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు యూరపియన్ల నియంత్రణలో ఉండటంవల్ల కావొచ్చు...ఆ దీవులు ఎందుకు పనికిరానివన్న అభిప్రాయంతో కావొచ్చు చైనా కూడా వాటిని పట్టించుకోలేదు. వియత్నాంపై పెత్తనం చలాయించిన కాలంలో ఫ్రాన్స్ ఈ దీవుల్లో కొన్నిటిని తన అధీనంలో ఉంచుకున్నది. ఆ రకంగా ఈ దీవులు తమవేనని వియత్నాం అంటుంటే...తమకు సమీపంలో ఉన్నాయి గనుక అవి తమకే చెందుతాయని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. నాలుగేళ్లక్రితమే ఈ దీవులన్నీ తమవేనని చైనా ప్రకటించి, అందుకొక చట్టం కూడా తెచ్చింది. ఆ ప్రాంతం మీదుగా విదేశీ నౌకలు వెళ్తే వెళ్లొచ్చుగానీ తనిఖీలకు ఒప్పుకోవాలని, అక్కడ నిలపడం, లంగరేయటం నిషిద్ధమని ఆ చట్టం చెబుతోంది. మరోపక్క అక్కడ కృత్రిమ దీవుల నిర్మాణాన్ని చురుగ్గా సాగిస్తోంది.
భౌగోళికంగా చూస్తే ఈ దీవులు కీలకమైనవి. ప్రధాన నౌకా రవాణా మార్గంగా ఉన్న ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటే భవిష్యత్తులో తమదే పైచేయి కాగలదని చైనా అంచనా వేసుకుంది. దీనికి ఇంధన వనరుల అన్వేషణ కూడా తోడైంది. దక్షిణ చైనా సముద్ర గర్భంలో అపారమైన చమురు, సహజ వాయు నిక్షేపాలున్నాయి. ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటే కొన్ని దశాబ్దాలపాటు ఇంధన రంగంలో తిరుగులేని శక్తిగా మారడానికి వీలవుతుందని చైనా భావించబట్టే ఆ ప్రాంతం గురించి అంత పట్టుదలగా ఉంది. సరిగ్గా ఈ కారణాలవల్లే ఈ ప్రాంతంపై అమెరికా కన్ను పడింది. చైనా ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి, ఇంధనరంగంలో అది మరింతగా ఎదగడానికి, రక్షణపరంగా అభేద్యం కావడానికి తోడ్పడే దీవుల్ని అలా కళ్లప్పగించి వదిలేయడం అమెరికా స్వభావానికే విరుద్ధం. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని డీగోగార్షియా దీవుల్ని బ్రిటన్‌తో కలిసి అది సొంతం చేసుకున్న తీరే ఇందుకు ఉదాహరణ. అక్కడ మానవమాత్రులుండటానికే వీలు కాదని, మూలవాసులుగా చెప్పుకుంటున్న ఓ వందమంది, అప్పుడప్పుడు అక్కడకు రాకపోకలు సాగించే మరికొందరూ తప్ప దాన్లో ఎవరూ లేరని ప్రపంచాన్ని మభ్యపెట్టి ఆ దీవుల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. క్రమేపీ ఆ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మార్చారు. ఇప్పుడు దక్షిణ చైనా సముద్ర ప్రాంత దీవులపై ఎవరి ఆధిపత్యం ఏర్పడినా జరిగేది ఇదే.
నిజానికి చైనా దూకుడువల్ల మన దేశానికి కూడా భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇప్పటికే పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు నౌకాశ్రయాలను నిర్మించడంద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్‌ను దిగ్బంధించడానికి చైనా ఏర్పాట్లు చేసుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో నాలుగేళ్లక్రితం వియత్నాం అభ్యర్థన మేరకు చమురు వెలికితీత పనుల్ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని పరోక్షంగా హెచ్చరించి వాటిని అడ్డుకుంది. అటు రష్యాతో వచ్చిన వివాదంలో తలమునకలు కావడంవల్లనో, మరే కారణంవల్లనో అమెరికా ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మొదట్లో తొలిసారి అమెరికా దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తమ నౌకా దళ విన్యాసముంటుందని గత కొంత కాలంగా అమెరికా లీకులిస్తోంది. గత నెలలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సైతం ఇది కొనసాగింది. ఇటు చైనా కూడా అధికారికంగా స్పందించలేదు. అక్కడ అమెరికా విన్యాసాలు చూశాకే కఠిన పదజాలంతో విరుచుకు పడింది. ఆ ప్రాంతంపై తమకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉన్నదని ప్రకటించింది. అక్కడ తమ కృత్రిమ నిర్మాణాలవల్ల అంతర్జాతీయ రవాణా మార్గానికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తబోవని చెబుతూనే దీవుల జోలికొస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించింది. ఏతా వాతా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఉద్రిక్తతలకు నెలవు కాబోతున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆధిపత్య ధోరణులతో, అంతులేని దురాశతో చేసే పనులవల్ల ఘర్షణలు రాజుకోవడమే కాదు...పర్యావరణం సైతం సర్వ నాశనమవుతుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం మరో డీగోగార్షియా కాకూడదని శాంతి కాముకులు ఆశిస్తారు.