
సల్మాన్ మొహియుద్దీన్
‘ఉగ్ర’ సంస్థలో చేరేందుకు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ నగర విద్యార్థి
ఫేస్‌బుక్ ద్వారా గాలం వేసిన దుబాయ్ లేడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ‘‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)’’ ఉగ్రవాద సంస్థ జాడలు విస్తరిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఈ ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన 18 మంది నగర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ చేసి పంపించారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్న వారే కావడం గమనార్హం.
తాజాగా ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) శుక్రవారం తెల్లవారుజామున చేరుకున్నాడు. ఇది పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బజార్‌ఘాట్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సల్మాన్ మొహియుద్దీన్ (32) వికారాబాద్‌లోని అన్వర్-ఉల్-ఉలూం కళాశాలలో 2002-08లో బీటెక్ (ఈసీఈ) చేశాడు. ఆ తరువాత ఎంఎస్ (ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్) టెక్సాస్ సౌతెర్న్ యూనివర్సిటీలో చేశాడు. ఆ తర్వాత అమెరికాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేశాడు.
ఈ సమయంలోనే అతనికి ఫేస్‌బుక్ ద్వారా ఇంగ్లండ్‌కు చెందిన జోసఫ్ అలియాస్ ఆయేషా (26) (ఇస్లాం మతం స్వీకరించి దుబాయ్‌లో ఉంటుంది) తో పరిచయం అయింది. అది వారిద్దరి మధ్యా ప్రేమకు దారి తీసింది. ఆ తరువాత ఆమె సల్మాన్‌ను ఉగ్రవాదం వైపు నెమ్మదిగా లాగింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యం స్థాపించేందుకు పవిత్ర యుద్ధం చేయాలంటూ ఆమె సల్మాన్‌ను ఒప్పించింది. ఈ క్రమంలో ముందుగా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరాలని కోరడంతో అతడు అందుకు అంగీకరించాడు.
గత ఏడాది సిరియా వెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. తాజాగా వీసా రావడంతో దుబాయ్ వెళ్లి ఐఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసమే శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి విచారణలో తాను ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నానని సల్మాన్ అంగీకరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.