యుద్ధంపై అమెరికా ఆలోచనలేమిటి?
ఉత్తర కొరియా అణు కార్యక్రమం విషయంలో చేపట్టదగ్గ చర్యల విషయమై అమెరికా జాతీయ భద్రతా మండలి.. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. దక్షిణ కొరియాలో అమెరికా అణ్వస్త్రాలను మోహరించడం, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్‌ను అంతమొందించడం అందులో ప్రధానాంశాలుగా ఉన్నాయని సమాచారం. గత వారంలో చైనా అధ్యక్షుడితో ట్రంప్ భేటీకి ముందు ఈ నివేదికను అందించారు.
అయితే.. ఉత్తర కొరియాను నియంత్రించేందుకు చైనా దౌత్యపరంగా ప్రయత్నించడంతో పాటు ఆ దేశంపై ఆంక్షలను తీవ్రం చేస్తూ ఒత్తిడి తెస్తుందని తాము భావిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఒకవేళ చైనా మార్గం ఫలించకపోతే, ఉత్తర కొరియా తన అణ్వస్త్ర అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తే అమెరికా సీరియస్‌గా స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
⇒ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత పాతికేళ్ల కిందట దక్షిణ కొరియా నుంచి అమెరికా తన అణ్వస్త్రాలన్నింటినీ ఉపసంహరించింది. ఇప్పుడు మళ్లీ ఉత్తర కొరియా లక్ష్యంగా దక్షిణ కొరియాలో అణ్వస్త్రాలను మోహరించే ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తే అది ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టే చర్య అవుతుందన్న ఆందోళన పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. పైగా అణ్వస్త్రాలను ప్రయోగించే ఆలోచనకు అమెరికా సైనిక నాయకత్వంలో సైతం పెద్దగా మద్దతు లేదు.
⇒ అణ్వస్త్రాల మోహరింపునకు ప్రత్యామ్నాయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్‌ను, ఇతర అణ్వస్త్ర పరిశోధన, సైనిక నాయకత్వాన్ని అంతమొందించే ఆలోచన కూడా ముందుకు తెచ్చారు. అయితే.. ఇటువంటి చర్యకు చైనా ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉందనే సంశయం అమెరికా నాయకత్వంలో నెలకొంది. అదీగాక.. ఎప్పుడు ఎలా స్పందిస్తాడో తెలియని ఒక ప్రమాదకర పాలకుడిని అంతమొందించిన తర్వాత.. ఆ దేశంలో పరిణామాలు ఎలా ఉంటాయనేదీ ప్రశ్నార్థకమేనని.. దానిని అంచనా వేయలేమని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
⇒ ఇక మూడో ప్రత్యామ్నాయంగా.. అమెరికా, దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలను ఉత్తర కొరియాలోకి పంపించి, అక్కడ వంతెనల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను పేల్చివేయటం ద్వారా క్షిపణుల కదలికలను అడ్డుకోవచ్చనే ప్రతిపాదన చేశారు. ఒకవేళ ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టాలనుకుంటే ఈ మూడో ప్రత్నామ్నాయమే ఉత్తమ మార్గమని కొందరు నిపుణులు అంటున్నారు.
కానీ.. ఉత్తర కొరియా సమస్యకు సంబంధించి ఏ పరిష్కారానికైనా సరే అందులో చైనా పాత్ర కూడా ఉండాలని అమెరికా వ్యూహాత్మక కమాండ్ కమాండర్ జనరల్ జాన్ హైటెన్ తాజాగా స్పష్టంచేశారు. చైనా పాత్ర లేని పరిష్కారం కష్టసాధ్యమని పేర్కొన్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్