
టాక్సీ డ్రైవర్ భళా!
క్యాబ్‌లో దొరికిన రూ. 1.85 కోట్లు గ్యాంబ్లర్‌కు అప్పగింత
వాషింగ్టన్: అమెరికాలో ఓ టాక్సీ డ్రైవర్ నిజాయితీ ప్రదర్శించాడు. క్యాబ్‌లో తనకు దొరికిన సుమారు రూ. కోటిన్నరను తిరిగి ఇచ్చి అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు. లాస్ వెగాస్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ గెరార్డో గాబోవా 13 ఏళ్లుగా ఎల్లో చెక్కర్ స్టార్ క్యాబ్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం స్థానిక కాస్మోపాలిటన్ కాసినో నుంచి ఓ పోకర్ ప్లేయర్‌ను పామ్స్ పేలస్ హోటల్‌కు తన టాక్సీలో తీసుకెళ్లి దించేశాడు. ఆ తర్వాత మరో ప్యాసింజర్‌ను పికప్ చేసుకునేందుకు వెళ్లిపోయాడు. అయితే రెండో ప్యాసింజర్ ను క్యాబ్‌లోకి ఎక్కించుకునే సమయంలో వెనుక సీటులో మూడు లక్షల డాలర్ల (రూ.1.85 కోట్లు)తో ఉన్న ఓ పేపర్ బ్యాగ్‌ను గుర్తించాడు గెరార్డో.
వెంటనే సమాచారాన్ని క్యాబ్ కంపెనీకి తెలియజేశాడు. అప్రమత్తమైన కంపెనీ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. కొద్దిగంటల తర్వాత ఆ డబ్బు మర్చిపోయింది 28 ఏళ్ల గ్యాంబ్లర్‌గా గుర్తించిన అధికారులు అతనికి పేపర్ బ్యాగ్‌ను అప్పగించారు. దీంతో క్యాబ్ డ్రైవర్ నిజాయితీకి ముగ్ధుడైన ఆ గ్యాంబ్లర్ అతనికి పది వేల డాలర్ల(సుమారు రూ. 6 లక్షలు) చెక్కును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక క్యాబ్ కంపెనీ అయితే గెరార్డోను ‘డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించడమే కాక.. అతనికి వెయ్యి డాలర్ల (సుమారు రూ. 62 వేలు) నగదు రివార్డును ఇచ్చింది.