ద్రౌపది వస్త్రా పహరణంతో సమానం
ట్రిపుల్ తలాక్ పట్ల మౌనంపై యూపీ సీఎం అభివర్ణన
లక్నో: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న ట్రిపుల్ తలాక్ విషయంలో మౌనం వహించిన నేతలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్‌పై మౌనాన్ని మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంతో పోల్చారు. ట్రిపుల్ తలాక్‌కు మద్దతిచ్చే వారితో పాటు మౌనంగా ఉన్న వారు కూడా నేరస్తులే అని వ్యాఖ్యానించారు. ‘ఈ మధ్యకాలంలో, ట్రిపుల్ తలాక్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కొంతమంది మౌనం వహిస్తున్నారు. దీన్ని చూస్తే మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘటన గుర్తుకువస్తోంది.
ఈ పరిస్థితికి కారణమెవరని ద్రౌపది అక్కడున్న వారిని ప్రశ్నిస్తుంది. ఎవ్వరూ ఒక్కమాట కూడా మెదపరు. ఒక్క విదురుడు మాత్రమే స్పందిస్తూ.. నేరానికి పాల్ప డినవారితో పాటు ఆ నేరానికి మద్దతిచ్చినవారు..మౌనంగా ఉన్నవారు అందరూ బాధ్యులే అని సమాధానమిస్తాడు’ అని ట్రిపుల్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన వివరించారు. సోమవారం మాజీ ప్రధాని చంద్ర శేఖర్ 91వ జయంతి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్‌కు అంతం పలకాలని, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయాలని పేర్కొన్నారు.
అవివేకమైన వ్యాఖ్యలు: ఏఐఎంపీఎల్‌బీ
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు అవివేకమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) విమర్శించింది. ఏఐపీఎల్‌బీ జనరల్ సెక్రటరీ మౌలానా వలీ రెహ్మానీ మాట్లాడుతూ..‘ఆ అవివేక వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. తలాక్ విషయాన్ని ఆయన (యోగి) ద్రౌపది వస్త్రాపహరణతో ముడిపెడుతున్నారు. విచక్షణ ఉన్న వారు ఎవరూ ఇలా చేయరు. విషయాలను ఆయన వేరే కోణంలో చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలనీ, సతీసహగమనాన్ని రూపుమాపినట్లుగానే దీన్ని అరికట్టాలని ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్ కోరింది.