టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఉచిత ల్యాపీలు
పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ.. ఇలా ఏ బోర్డులో చదివినా ప్రతిభావంతులైన 39,600 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ల్యాప్టాప్లలో సగం పదోతరగతి పాసైన వాళ్లకు, మరో సగం ఇంటర్ పాసైనవాళ్లకు ఇస్తారు.
ఆయా బోర్డుల్లో వాళ్లు సాధించిన ఫలితాలను బట్టి వీటిని అందిస్తారు. అయితే ఇందులో 21 శాతం ఎస్సీ, ఎస్టీలకు, 20 శాతం మైనారిటీలకు ఇచ్చే కోటా కూడా కొనసాగుతుంది. 2012 ఎన్నికల మేనిఫెస్టోలోనే ల్యాప్టాప్లు, టాబ్లెట్లను ఉచితంగా ఇస్తామన్న హామీని సమాజ్వాదీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటివరకు 15 లక్షల ల్యాప్టాప్లను అందించినా, ట్యాబ్ల జాడ మాత్రం ఎక్కడా లేదు. అలాగే 2012 తర్వాత మళ్లీ ల్యాప్టాప్లు ఇవ్వడం కూడా మళ్లీ ఇప్పుడే.