అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
మహబూబ్నగర్ : స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమకు సముచిత స్థానం కల్పించలేదని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు అలిగి అక్కడి నుంచి వెళ్లి పోయారు. శనివారం మహబూబ్నగర్ పట్టణంలో పోలీస్ గ్రౌండ్స్లో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఏ వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్ హాజరయ్యారు. అయితే వారికి కనీసం వీఐపీ గ్యాలరీలో కూడా కుర్చీలు వేయలేదు. దాంతో వారు అలిగారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాకు అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య వేడుకల్లో బుక్లెట్లో అమరవీరుల ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాకు గౌరవం ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ వేడుకల్లో తమకు జిల్లా కలెక్టర్ శ్రీదేవితోపాటు ఉన్నతాధికారులు సముచిత స్థానం ఇవ్వలేదని వారు ఆరోపించి... అక్కడి నుంచి వెళ్లిపోయారు.