తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట | Venkaiah naidu, Subramanian swamy comments on Tamil Nadu crisis | Sakshi
Sakshi News home page

తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట

Published Mon, Feb 13 2017 2:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట - Sakshi

తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట

గవర్నర్‌పై కేసు వేస్తా: సుబ్రమణ్యస్వామి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ముగించేందుకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సోమవారంలోగా నిర్ణయం తీసుకోకపోతే ఆయనపై కేసు వేస్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు.

శనివారం రాత్రి ఆకస్మికంగా గవర్నర్‌తో భేటీ అయిన ఎంపీ సుబ్రమణ్యస్వామి రాజ్యాంగం ప్రకారం శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. కాగా తమిళనాడులో ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనని తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మాజీ గవర్నర్‌  రోశయ్య వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా తన వర్గం నుంచి పన్నీర్‌ సెల్వం వైపు ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్‌ను శశికళ పార్టీ నుంచి బహిష్కరించారు.

ఆ ప్రతిపాదనను స్వాగతిస్తున్నా: వెంకయ్య
బెంగళూరు: పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసమైన వేదనిలయాన్ని ‘అమ్మ’ స్మారక భవనంగా మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్వాగతించారు. ఆదివారమిక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జయలలిత గొప్ప నాయకురాలని, ఆమె నివాసాన్ని స్మారక భవనంగా మార్చడమనేది మంచి నిర్ణయమన్నారు. అయితే ఇది అన్నాడీఎంకే, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన అంశమని, దీంట్లో కేంద్రం పాత్ర ఏమీ లేదన్నారు.

గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించొద్దు..
మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని శశికళ ప్రశ్నించడాన్ని ప్రస్తావించగా.. వెంకయ్య స్పందిస్తూ, గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించొద్దని, ఆయన రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా తన విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. తమిళనాడు ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకు రాజ్యాంగ బద్ధంగా గవర్నర్‌ నడుచుకుంటారని చెప్పారు. అయినా అక్కడ ఎలాంటి ఖాళీ లేదని, ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు.

అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభాన్ని ఆ పార్టీ నేతలే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. జయలలిత ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. అయినా ఆయన తరఫున మాట్లాడటానికి తానేమీ పన్నీర్‌ న్యాయవాదిని కాదన్నారు. కాగా, ఆ రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీకి సభ్యులు లేరని, అందువల్ల తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement